Andhra Pradesh Economy: గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోయిందని, ఆర్థిక వృద్ధి, ఆదాయం గణనీయంగా తగ్గాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేస్తూనే, ప్రజలకు సంక్షేమ పథకాలు నిరాటంకంగా అందిస్తోందని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం కేంద్ర పథకాల్లో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. కేంద్ర నిధులను ఇతర పథకాలకు మళ్లించడం ద్వారా రాష్ట్ర ప్రగతికి ఆటంకం కలిగించిందని దుయ్యబట్టారు.
ఆర్థిక క్రమశిక్షణ, వృద్ధి లక్ష్యం
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) వృద్ధిరేటు 2014-19 మధ్య 13.5 శాతంగా ఉండగా, 2019-24 మధ్య కాలంలో ఇది కేవలం 10.32 శాతానికి పడిపోయిందని గణాంకాలను వెల్లడించారు సీఎం చంద్రబాబు. ఆస్తులు, భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తేవడం తప్ప, మూలధన వ్యయం (Capital Expenditure) చేయకపోవడం వల్లే ప్రాజెక్టులు ముందుకు సాగలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రాజెక్టులపై మూలధన వ్యయం పెంచి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేశామని తెలిపారు. ప్రతి త్రైమాసిక, ఆర్థిక ఏడాది రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పర్యవేక్షిస్తూ, ప్రజల కోసం ఎంత కష్టమైనా బాధ్యతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
విద్యుత్, పీపీఏలు, వ్యవస్థల పునర్నిర్మాణం
విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సీఎం ప్రస్తావించారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం గతంలో రూ.9 వేల కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేదన్నారు. అంతేకాక, పీపీఏల (PPA – Power Purchase Agreement) రద్దు పేరుతో కక్షపూరిత రాజకీయాలతో ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. ప్రస్తుతం విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే విద్యుత్ రంగాన్ని సమర్థంగా నిలబెడుతున్నామని, వచ్చే ఏడాది మరింత సమర్థత పెంచుకుంటామని తెలిపారు.
విద్యా సంస్కరణలు, మౌలిక వసతులు
గత పాలన దెబ్బకు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిన్నదని, వైసీపీ చేసిన దారుణాల వల్ల కొన్ని కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని ఆయన అన్నారు. సాగు నీటి కోసం చెక్ డ్యామ్‌ల నిర్మాణం, పంట గుంటల తవ్వకం వంటి పనులను వేగవంతం చేశామన్నారు. విద్యారంగంలోనూ సంస్కరణలు తెచ్చి, వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, గతంలో పెండింగ్‌లో పెట్టిన బిల్లులను క్లియర్ చేస్తున్నామని తెలిపారు. పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు వాట్సప్ గవర్నెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ‘పల్లె పండుగ’ ద్వారా గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని చంద్రబాబు వివరించారు. రాష్ట్రానికి 85 లక్షల టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చి వెళ్లిందిగా ఆయన గత ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

