CM Chandrababu Naidu: 2026 డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా మరో 4.50 లక్షల ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 5.50 లక్షల ఇళ్లను నిర్మించి పేదలకు అందించినట్లు తెలిపారు. రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 2.50 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించడం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. సోమవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో నిర్వహించిన భారీ గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-comments-on-kcr-2/
ఈ సందర్భంగా సూళ్లూరుపేట సమీపంలోని పుదూరులో సీఎం స్వయంగా లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశం చేయించి, వారితో ముచ్చటించారు. 2029 నాటికి రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. టిడ్కో ఇళ్లలో కేవలం నివాసం మాత్రమే కాకుండా పైపుల ద్వారా గ్యాస్ సరఫరా, ఇంటింటికీ తాగునీటి కుళాయిలు, మరియు సోలార్ ప్యానెల్స్ వంటి వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనే ధ్యేయంతో ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు అన్నారు. గతంలో నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నామని స్పష్టం చేశారు.

