Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Free Bus: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. ఫ్రీ బస్సు అప్పటి నుంచే!

Free Bus: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. ఫ్రీ బస్సు అప్పటి నుంచే!

Free Bus in AP: ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సేవను ప్రారంభించేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక దిశానిర్దేశం చేశారు. ఈ పథకాన్ని వచ్చే ఆగస్టు 15 నుంచి అమలులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అదే తేదీ నుంచి మహిళలకు జీరో ఫేర్ టికెట్లు జారీ చేయాలని స్పష్టంగా తెలిపారు. ఈ సేవను ఉపయోగించే మహిళలకు ప్రయాణ వివరాలు, ప్రయోజనాలను స్పష్టంగా తెలియజేయాలనే ఉద్దేశంతో, టికెట్లపై కొన్ని వివరాలు ముద్రించాలని సీఎం సూచించారు. అందులో భాగంగా.. ప్రయాణం ప్రారంభ స్థలం, గమ్యస్థానం వంటివి అందులో ముద్రించాలని సూచించారు. అలాగే ఈ ఉచిత ప్రయాణం వల్ల మహిళ ఎంత డబ్బు ఆదా చేసుకున్నది, రాయితీ శాతం వంటి వివరాలు స్పష్టంగా ఉండాలని అన్నారు.

- Advertisement -

కొత్తగా కొనేవి ఎలక్ట్రిక్ బస్సులే

భవిష్యత్‌లో RTC బస్సుల కొనుగోళ్లు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకే పరిమితం చేయాలని సీఎం ఆదేశించారు. ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు, దిగ్విజయంగా అభివృద్ధికి దోహదపడే నిర్ణయంగా ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఏయే రకాల బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణం అమలులోకి వస్తుందనే దానిపై పూర్తి స్పష్టత లేదు. పథకం మార్గదర్శకాలు విడుదలైన తర్వాత మాత్రమే దీనిపై పూర్తి సమాచారం అందనుంది. పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులో ఉండొచ్చని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. కానీ ఎక్స్‌ప్రెస్, లగ్జరీ బస్సులపై ఈ వెసులుబాటు ఉంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.

తెలంగాణలో ఇప్పటికే అమలులో ఉన్న ‘మహాలక్ష్మి’ పథకం

తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తోంది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో జీరో ఫేర్ టికెట్లు జారీ చేస్తోంది. మెట్రో, ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా హైదరాబాద్ పరిధిలో ఉచిత సేవలు లభిస్తున్నాయి. టికెట్లపై ప్రయాణ వివరాలు, పథకం పేరు మొదలైనవి ముద్రించి ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ పథకం మొదటిగా పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సులకు పరిమితం కావచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆర్టీసీపై వ్యయ భారం తక్కువగా పడేలా అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించాలని చంద్రబాబు సూచించారు. ఈ పథకం అమలుకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయని అంచనా. ఆ తర్వాత ఉచిత ప్రయాణానికి అర్హత, వర్తించే బస్సులు, టికెట్ నమూనా తదితర విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad