CM Chandrababu Land Records: రాష్ట్రంలోని భూ రికార్డులకు బ్లాక్‌చైన్ సాంకేతికతతో అత్యంత పటిష్టమైన భద్రత కల్పిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని సురేపల్లిలో గురువారం నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. మార్చి 2027 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ల్యాండ్ రీసర్వే 2.0 పూర్తి చేసి, 1.12 కోట్ల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
కొత్తగా జారీ చేస్తున్న పాస్ పుస్తకాలను కరెన్సీ తరహా సెక్యూరిటీ ఫీచర్లు, రాజముద్ర, క్యూఆర్ కోడ్‌తో రూపొందించాం. వీటిని ఎవరూ తారుమారు చేయలేరు. భూ రికార్డుల భద్రత కోసం బ్లాక్‌చైన్ టెక్నాలజీని వినియోగిస్తున్నాం. దీనివల్ల రికార్డులు అత్యంత సురక్షితంగా ఉంటాయి. భూ యజమానులు తమ రికార్డులను డిజిటల్ పద్ధతిలో లాక్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నాం. దీనివల్ల యజమాని అనుమతి లేకుండా ఎలాంటి లావాదేవీలు జరగవు.- సీఎం చంద్రబాబు
జూన్ 2024 నుంచి ఇప్పటివరకు 9 లక్షల భూ లావాదేవీలకు ఆటో-మ్యూటేషన్ పూర్తి చేశామని సీఎం అన్నారు. అమ్మకాలు, బహుమతులు, విభజన పత్రాల్లో 100 శాతం ఆటో-మ్యూటేషన్ తీసుకొచ్చామని చెప్పారు. ఇకపై పాస్‌బుక్ కోసం ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సిన పనిలేదని వెల్లడించారు. ఆస్తి రిజిస్ట్రేషన్ కాగానే, ప్రింట్ చేసిన పాస్‌బుక్‌ను నేరుగా యజమాని ఇంటికి పంపాలని అధికారులను ఆదేశించారు. వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా సులభతరం చేశామని తెలిపారు.
‘గత ప్రభుత్వం సృష్టించిన భూ వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోతున్నాం. ప్రతి నెల 9వ తేదీన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నాను. రెవెన్యూ శాఖలో ప్రభుత్వం తెచ్చిన మార్పులు, సంస్కరణలు ప్రజలకు వివరిస్తున్నాను. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కారం చేసేందుకు యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తున్నాను. ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం ద్వారా భూ యజమానులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందచేసినప్పుడు వారి ముఖాల్లో కనిపించిన ఆనందం ఎంతో సంతృప్తినిచ్చింది. ఇప్పటి వరకు 21.23 లక్షల పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేశాం. భూమే ప్రాణంగా, జీవితంగా, భవిష్యత్ గా భావించే రైతుల భూ వివాదాలు పరిష్కరిస్తాం. వారికి భద్రత, భరోసాను కల్పిస్తాం.’- అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read: https://teluguprabha.net/telangana/dgp-shivadhar-reddy-writes-a-letter-to-the-police-on-corruption/
భూ రికార్డులను ఎవరైనా ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నిస్తే, వారిపై పీడీ చట్టం ప్రయోగించి జైలుకు పంపుతామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా గ్రామసభల ద్వారా పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కొత్త వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరా భూమికి పూర్తి స్థాయి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు వివరించారు.

