Vehicle Registration CM Chandrababu: రాష్ట్రంలో ఇకపై వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24 గంటల్లో పూర్తి చేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందాలని, అందుకు అనుగుణంగా అధికారులు వినూత్న ఆలోచనలు చేయాలని దిశానిర్దేశం చేశారు.
Also Read: https://teluguprabha.net/national-news/pm-modi-hails-bjps-victory-in-west-bengal-as-historic/
వాహనం కొనుగోలు చేసిన చోటే రిజిస్ట్రేషన్ పూర్తిచేసేలా, వాహన డీలర్లనే అదనపు రిజిస్ట్రేషన్ అథారిటీగా గుర్తిస్తూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానం ద్వారా కేవలం 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. వాహనదారులకు ఎలాంటి జాప్యం, ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో వాహనదారులు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పుతుందని వెల్లడించారు.
మరోవైపు ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగాన్ని మరింత పెంచాలని సీఎం పేర్కొన్నారు. ఏఐని సమర్థంగా వాడుకునేందుకు నిపుణులతో ఒక సలహా మండలిని ఏర్పాటు చేయాలని చెప్పారు. అదేవిధంగా, రాష్ట్రంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఒక వర్క్‌షాప్ నిర్వహించాలన్న సీఎం.. మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణకు మధ్యప్రదేశ్ డ్రోన్ వ్యవస్థను ఎలా వినియోగిస్తుందో అధ్యయనం చేయాలని సూచించారు. తద్వారా ఏపీలోనూ ఆ విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/manchu-lakshmi-wishes-to-trisha-krishnan-on-her-birthday/
కాగా, రాష్ట్రంలో ఎండలు, వడగాల్పులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘అవేర్’ సాంకేతికతను వాడుకోవాలి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వడదెబ్బ తగలకుండా మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలి. ఈ కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలి. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా, ప్రతి జిల్లా కలెక్టర్‌కు తక్షణ అవసరాల నిమిత్తం రూ.1 కోటి చొప్పున నిధులు విడుదల చేయాలి. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలి. బోర్ల మరమ్మతులు చేపట్టాలి.’- అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశంలో సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

