CM Chandrababu London Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్ పర్యటనలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో విజయం సాధించారు. ఇందులో భాగంగా, ప్రముఖ గ్లోబల్ సంస్థలైన హిందుజా గ్రూప్ మరియు ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ప్రతినిధులతో సీఎం కీలక సమావేశాలు నిర్వహించారు.
హిందుజా గ్రూప్‌తో రూ.20,000 కోట్ల ఒప్పందం!
సీఎం చంద్రబాబుతో జరిగిన భేటీ తర్వాత, హిందుజా గ్రూప్ ఏపీలో దశలవారీగా ఏకంగా రూ. 20,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం, హిందుజా గ్రూప్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. విశాఖపట్నంలోని హిందుజా పవర్‌ప్లాంట్ ప్రస్తుత సామర్థ్యానికి అదనంగా మరో 1,600 మెగావాట్లు (ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు) పెంచనున్నారు. అదే విధంగా రాయలసీమ ప్రాంతంలో భారీగా సౌర (సోలార్), పవన (విండ్) విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. కృష్ణా జిల్లాలోని మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు , తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్‌ను నెలకొల్పడంతో పాటు, ఏపీ వ్యాప్తంగా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్, గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి హిందుజా గ్రూప్ సహకరించనుంది.
ఆక్టోపస్ ఎనర్జీతో స్మార్ట్ గ్రిడ్ చర్చలు
అంతకుముందు, లండన్‌లో అతిపెద్ద విద్యుత్ సరఫరాదారుల్లో ఒకటైన ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జ్‌జార్డ్‌తోనూ సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆయన సంస్థను ఆహ్వానించారు.160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలనే ఏపీ లక్ష్యాన్ని, విద్యుత్ రంగంలో ప్రభుత్వ పాలసీలను సీఎం వారికి వివరించారు. అమరావతి, విశాఖపట్నంలో నూతన టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా నియంత్రణ (స్మార్ట్ గ్రిడ్), క్లీన్ ఎనర్జీ, డేటా అనలిటిక్స్ రంగాల్లో పనిచేసేందుకు ఆక్టోపస్ ఎనర్జీకి గల అవకాశాలను సీఎం వివరించారు. ఈ పర్యటన ద్వారా లభించిన పెట్టుబడులు ఏపీని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చడంలో, పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.


