CM Chandrababu sensational comments on Jagan: ఏపీ రాజకీయాల్లో రాజధాని అమరావతి అంశం మరోసారి చిచ్చు రేపింది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిపై చేసిన వ్యాఖ్యలకు గానూ సీఎం చంద్రబాబు ఇచ్చిన కౌంటర్లతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నదీ గర్భం అంటే ఏంటో, నదీ పరివాహక ప్రాంతం అంటే ఏంటో కూడా జగన్‌కు తెలియదని ఎద్దేవా చేశారు. అమరావతిపై జగన్ మళ్లీ అసత్య ప్రచారాలు మొదలుపెట్టారని.. గత ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పినప్పటికీ రాజధానిపై విషం చిమ్మడం మానలేదని మండిపడ్డారు. మిగులు జలాలను వినియోగించుకోవడం ఎలా తప్పవుతుందో జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచంలోని అనేక గొప్ప నగరాలు నదీ తీరాల్లోనే అభివృద్ధి చెందాయని సీఎం గుర్తు చేశారు. ప్రాచీన సింధు నాగరికత నుంచి నేటి ఢిల్లీ, లండన్ వంటి ప్రముఖ నగరాల వరకు అన్నీ నదుల పక్కనే వికసించాయని ఉదాహరణగా చెప్పారు. అమరావతి భౌగోళిక స్థితిగతులపై అవగాహన లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. జగన్ తన పాలనలో రాయలసీమకు తీరని ద్రోహం చేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజధానిపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
వైసీపీ కుట్రలను తిప్పి కొట్టాలి..
జగన్ వ్యాఖ్యలపై ఇప్పటికే కూటమి ప్రభుత్వంలోని మంత్రులు, నేతలు ఘాటుగా స్పందించారని చంద్రబాబు తెలిపారు. అమరావతికి వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇకనైనా ఇలాంటి అసత్య ప్రచారాలను మానుకోవాలని సూచించారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

