నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంట్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృతి చెందడం బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇక ఈ ప్రమాదంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు వైద్య విద్యార్ధులు, మరొకరు మృత్యువాత పడటం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కాగా ముంబై జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్‌బంకు వద్దకు రాగానే అదుపుతప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య (50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చికిత్స పొందుతూ ఐదుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది.