Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల అమలు విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానమిస్తూ కీలక సవాళ్లు విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పెన్షన్ల మినహా ఇతర పథకాలు అమలు చేయడం లేదంటూ వైసీపీ విమర్శలు గుప్పించింది.
అయితే, గత రెండు నెలల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు వంటి కీలక పథకాలను అమలు చేసి, చంద్రబాబు ఆ విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పారు.ఈ నేపథ్యంలో, రాజంపేటలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వైసీపీ నేతలు తరచుగా చెప్పే ‘సిద్ధం.. సిద్ధం’ అనే నినాదాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అసెంబ్లీకి వచ్చి అభివృద్ధి, సంక్షేమంపై చర్చించేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సంపద సృష్టించగలిగితేనే సంక్షేమ పథకాలు అమలు చేయగలమని ఆయన స్పష్టం చేశారు. కేవలం సంక్షేమమే కాకుండా, వివేకా హత్య కేసు మరియు గులకరాయి డ్రామా వంటి అంశాలపై కూడా చర్చకు సిద్ధమా అని వైసీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.
తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ విశ్రాంతి తీసుకోలేదని, గత 30 ఏళ్లుగా ఒక లక్ష్యంతో పనిచేస్తున్నానని చంద్రబాబు తెలిపారు. పేదల జీవితాల్లో వెలుగు నింపడమే తన ప్రభుత్వ లక్ష్యమని, జీతాలు, పెన్షన్లు సకాలంలో అందిస్తున్నామని చెప్పారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే అభివృద్ధి సాధ్యమని, తద్వారా ఆదాయం పెరిగి ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. రాయలసీమను ‘రతనాలసీమ’గా మారుస్తామన్న వైసీపీ, అధికారం వచ్చాక వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. ఈ సవాళ్లు, ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెర తీశాయి.


