CM Chandrababu Schedule Today: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం మంత్రుల బృందంతో కలిసి సింగపూర్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించేందుకు, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన అంతర్జాతీయ సహకారాన్ని తీసుకురావడమే ఈ పర్యటనకు ప్రధాన ఉద్దేశం. పర్యటనలో భాగంగా చంద్రబాబు సోమవారం (జూలై 29) వరుస సమావేశాలతో బిజీ బిజీగా ఈరోజును గడపనున్నారు. తన పర్యటనలో భాగంగా ఈరోజు చంద్రబాబు.. భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు సింగపూర్ ట్రెజరీ బిల్డింగ్ వద్ద అక్కడి వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి టాన్ సీ లెంగ్ను కలుసుకున్నారు. ఈ సమావేశంలో విద్యుత్, సైన్స్ & టెక్నాలజీ, పరిశ్రమల సహకారంపై చర్చలు జరిగాయి.
తరువాత ఉదయం 8:30కి ఎయిర్‌బస్ సంస్థ ప్రతినిధులు కృతీవాస్, వేంకట్ కట్కూరిలతో సమావేశమయ్యారు. వెంటనే ఉదయం 9:00కి హనీవెల్ సంస్థ ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఉదయం 9:30 నుండి 11:00 వరకు బిజినెస్ రౌండ్ టేబుల్ సెషన్‌లో చంద్రబాబు పాల్గొన్నారు. “నైపుణ్యాల నుంచి సామర్థ్యాల వైపు పురోగమించడమే లక్ష్యం” అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సెషన్‌లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (NUS), నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ (NTU), సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్శిటీ (SMU), సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ & డిజైన్ (SUTD)కు చెందిన విద్యార్థులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇతర ముఖ్య సమావేశాలు
ఉదయం 11:00కి: ఎవర్వోల్ట్ చైర్మన్ సైమన్ టాన్‌తో సమావేశం
11:30కి: సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ సందర్శన – రాష్ట్ర క్రీడల అభివృద్ధిపై సమాలోచన
మధ్యాహ్నం 1:00కి: టుయాస్ పోర్ట్ సైట్ సందర్శన – పోర్ట్ ఆధారిత అభివృద్ధిపై PSA CEO విన్సెంట్‌తో చర్చ
సాయంత్రం కార్యక్రమాలు
4:30కి: ఆంధ్రప్రదేశ్-సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షోలో పాల్గొని, అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమక్షంలో రాష్ట్ర అభివృద్ధి వ్యూహాలను వివరించే ప్రసంగం చేయనున్నారు. 6:00కి: అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీతో ప్రత్యేక సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై కీలక చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక వృద్ధికి కీలక మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడమే కాక, దేశ విదేశీ పెట్టుబడిదారులకు రాష్ట్రం ఓ ఆకర్షణీయ గమ్యంగా నిలవాలన్నదే ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కొనసాగుతున్న ఈ పర్యటన వల్ల రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు రావాలని అధికారులు ఆశిస్తున్నారు. ఈ పర్యటన పట్ల రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తిగా ఉన్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు, రాష్ట్రానికి పెట్టుబడులను ఏ విధంగా తీసుకొస్తారనేది ఆసక్తికరంగా తిలకిస్తున్నారు.


