Chandrababu| ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో ఆరు నెలలు పూర్తి చేస్తుకుంది. ఈ ఆరు నెలల పాలనలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచిపోయాయని తెలిపారు. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని పేర్కొన్నారు.
బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు తాను, తన మంత్రివర్గ సహచరులు కృషి చేస్తున్నట్టు చెప్పారు. గాడితప్పిన వ్యవస్థల్ని ఈ ఆరు నెలల్లో సరిదిద్దామని.. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టామన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టామని వెల్లడించారు.
‘రాష్ట్రమే ఫస్ట్.. ప్రజలే ఫైనల్’ అనే నినాదంతో ప్రతిక్షణం ప్రజలకు మంచి చేసేందుకు పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. చేయాల్సింది ఎంతో ఉందనే బాధ్యతను గుర్తెరిగి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు వివరించారు. ప్రజల ఆశీస్సులు, భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర – 2047 విజన్‌తో ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్‌గా నిలబెడతామని ఆయన హామీ ఇచ్చారు.