Parliamentary legislation for Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవితవ్యానికి తిరుగులేని భరోసా కల్పించే దిశగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పావులు కదిపారు. అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా ఖరారు చేస్తూ, పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బలంగా కోరారు. పోలవరం పర్యటన ముగించుకుని హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన ఆయన, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై హోంమంత్రితో చర్చించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, బుధవారం రాత్రి ఢిల్లీలోని కృష్ణమేనన్ మార్గ్‌లో ఉన్న హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలకమైన అభివృద్ధి, ఆర్థిక అంశాలపై వినతిపత్రం సమర్పించారు.
సీఎం విజ్ఞప్తులు.. కీలక అంశాలు
అమరావతికి చట్టబద్ధత: రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తూ ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించాలని చంద్రబాబు కోరారు. దీనివల్ల, రాజధానిపై నెలకొన్న అనిశ్చితికి తెరపడి, రాష్ట్ర ప్రజల ఆశలు నెరవేరడమే కాకుండా, అభివృద్ధి వేగవంతమవుతుందని ఆయన వివరించారు.
బడ్జెట్‌లో ప్రాధాన్యం: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న అమిత్ షాను కోరారు. గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఉపాధి హామీ పథకంపై వెసులుబాటు: కేంద్రం ఇటీవల ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన ‘జీ రామ్ జీ’ పథకంలో, కేంద్ర-రాష్ట్రాల నిధుల వాటాను 60:40 నిష్పత్తికి మార్చడం, రాష్ట్రంపై తీవ్ర ఆర్థిక భారం మోపుతోందని వివరించారు. ఈ విషయంలో రాష్ట్రానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని కోరారు.
పోలవరం, పరిశ్రమలకు చేయూత: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని అమిత్ షాకు వివరించిన సీఎం, దానిని సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం చేయూతనివ్వాలని కోరారు.
విశాఖపట్నం పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఒప్పందాలకు అనుగుణంగా, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు, ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతమైన కొత్తగా ఏర్పాటైన పోలవరం జిల్లా (రంపచోడవరం కేంద్రంగా) అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరారు.
అమిత్ షాతో భేటీకి ముందు, చంద్రబాబు ఢిల్లీలోని తన అధికార నివాసంలో ఎల్‌జీ సంస్థ ప్రతినిధులతో సమావేశమై, శ్రీసిటీలో ఆ సంస్థ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ పురోగతిపై చర్చించారు. ఈ వరుస సమావేశాల అనంతరం, ఆయన అర్ధరాత్రి దాటాక అమరావతికి తిరిగి చేరుకున్నారు.

