Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: రాజధానిపై విషం చిమ్మే కుట్రలకు చెక్ పెడతాం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: రాజధానిపై విషం చిమ్మే కుట్రలకు చెక్ పెడతాం: సీఎం చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతి(Amaravati) వేశ్యలకు అడ్డాగా మారిందని ఓ ప్రముఖ టీవీ ఛానల్ డిబేట్ లో సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగుతోంది. మహిళలపై చేసిన నీచమైన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని మహిళా సంఘాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ అసభ్యకర వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

“ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనది. స్త్రీమూర్తులను ఆరాధించే సమాజం మనది. ఇది మన సంప్రదాయం. మన భారతీయ జీవన విధానం. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం. వాళ్లు ఎప్పుడూ అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదనేది స్పష్టం అవుతుంది. రాజధాని గురించి, ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదు. రాజకీయ, మీడియా ముసుగులో జరుగుతున్న ఇటువంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నాను.

తన సొంత మీడియా చానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికి ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరం. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం. గత విధ్వంస ప్రభుత్వంపై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రాంత మహిళలపై ఉద్దేశ్యపూర్వకంగా, నీచాతినీచంగా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్నే అవమానించడం. మహిళలను గౌరవించే, వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుంది” అని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad