CM Chandrababu| రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్న వారి ఆట కట్టస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అక్రమంగా రవాణా చేసిన వారిని వదిలిపెట్టమని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా మాఫియా, దోపిడీ ఉందన్నారు. తమ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా నేమకల్లులో పింఛన్ల పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామసభలో సీఎం ప్రసంగిస్తూ రాష్ట్రంలో 64లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు.
దేశంలో పింఛను ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదేనని చెప్పారు. పింఛన్ల కింద ఐదు నెలల్లో రూ.18వేల కోట్లు ఇచ్చామని చెప్పుకొచ్చారు. పింఛను 3 నెలలకోసారి తీసుకునే సౌకర్యం కల్పించామని.. లబ్ధిదారుల్లో కూలీలు, కార్మికులు ఉన్నారనే ఇలా ఏర్పాటు చేశామని వివరించారు. గతంలో నాసిరకం మద్యంతో విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. తాము నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.