టీడీపీలో వైసీపీ కోవర్టులు ఉన్నారని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు(Chandrababu) సంచలన వ్యాఖ్యలు చేశారు. కడపలో జరుగుతున్న రెండో రోజు మహానాడు (Mahanadu)లో చంద్రబాబు ప్రసంగిస్తూ.. “నేరస్తులూ ఖబడ్డార్.. నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను. కోవర్టులను మన దగ్గరికి పంపి ఆ కోవర్టుల ద్వారా మీ ఎజెండా అమలు చేయాలనుకుంటే అది సాధ్యం కాదు. వలస పక్షులు వస్తాయి.. పోతాయి.. నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై దుష్ప్రచారాలు చేస్తే సహించం. ఆడబిడ్డలపై అసభ్యంగా ప్రవర్తించే వారికి అదే చివరి రోజు అవుతుంది” అని హెచ్చరించారు.
“ఈ కడప గడ్డ మీద నుంచి చెబుతున్నా మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మర్డర్ తర్వాత నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారు. గుండెపోటుతో వివేకానంద రెడ్డి చనిపోయారంటే అందరి మాదిరిగా నేను కూడా నమ్మాను. ఆ తర్వాత నా మీదనే నెపం వేసే పరిస్థితికి వచ్చారు. అర్థమయిందా మీకు.. ఇప్పుడు నేను ఎవ్వరినీ నమ్మడం లేదు. కరుడుగట్టిన నేరరస్తులతో రాజకీయం చేస్తున్నాం” అని చంద్రబాబు తెలిపారు.