CM Chandrababu : సమాజానికి తిరిగి ఇవ్వడంలోనే నిజమైన సంతోషం దాగి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారతీయ సంస్కృతిలో ‘పరోపకారం పరమో ధర్మః’ అనే సూత్రం ప్రకారం, ఇతరులకు, సమాజానికి సేవ చేయడం మన సంప్రదాయంలో భాగమని తెలిపారు. ఈ స్ఫూర్తితోనే గతంలో ‘జన్మభూమి’ కార్యక్రమం ద్వారా సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టామని, ఇప్పుడు ‘జీరో పావర్టీ – పీ4’ కార్యక్రమంతో ఆ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించారు.
ALSO READ: caretaker crime Alert: కేర్‌టేకర్‌ల ముసుగులో ఘోరం… నమ్మినవారే నట్టేట ముంచారు!
ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో సంతృప్తినిస్తోందని చంద్రబాబు తెలిపారు. ఇటీవల ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త తిరుమల వేంకటేశ్వరస్వామికి 121 కిలోల బంగారం విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారని, ఇలాంటి విరాళాలు విద్య, వైద్యం వంటి కీలక సేవలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. సంపద సృష్టించడం కంటే, దాన్ని సమాజం కోసం ఖర్చు చేయడమే అసలైన ఆనందాన్ని ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
‘పీ4’ కార్యక్రమం ద్వారా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం, సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడం లక్ష్యమని చంద్రబాబు వివరించారు. సంపద సృష్టించిన ప్రతి ఒక్కరూ మంచి మనసుతో సమాజ సేవకు ముందుకు రావాలని, ఇది గొప్ప ఆదర్శంగా నిలిచి ఎన్నో మార్పులకు దారితీయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.


