Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు యూఏఈ పర్యటన తొలిరోజు విజయవంతంగా ప్రారంభమైంది. దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, అబుదాబీలోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్‌లతో ఆయన కీలక సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ చొరవను చంద్రబాబు ప్రశంసించారు. ప్రధాని మోదీ కృషి వల్లే దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ‘భారతదేశం బ్రాండ్’ ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం అవుతోందని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెరగడానికి ప్రధాని మోదీ పర్యటనలు దోహదపడ్డాయని కొనియాడారు.
ఏపీలో పెట్టుబడులకు సువర్ణావకాశం:
యూఏఈలోని వివిధ రంగాలకు చెందిన సంస్థలు, పెట్టుబడులకు ఏపీలో ఉన్న అవకాశాలపై ఈ భేటీల్లో ప్రధానంగా చర్చ జరిగింది. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, క్వాంటం కంప్యూటింగ్, పెట్రో కెమికల్స్, పోర్టులు, లాజిస్టిక్స్, ఏవియేషన్, ఇండస్ట్రియల్ పార్కులు, డేటా సెంటర్లు, రియల్ ఎస్టేట్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కీలక రంగాలలో పెట్టుబడులను ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 1054 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతంలో చేపట్టిన పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలను ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానం ద్వారా వేగంగా అనుమతులు ఇస్తున్నామని, యూఏఈ సావరిన్ ఫండ్స్ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమని తెలిపారు.
తెలుగువారికి సహకారం:
యూఏఈలో ఉన్న సుమారు 4.08 లక్షల మంది తెలుగు ప్రజలకు ఇండియన్ ఎంబసీ అవసరమైన సహకారాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో కోరారు. ఈ భేటీలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


