ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) నేటి నుంచి రెండు రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పం(Kuppam)లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఈరోజు(సోమవారం) ఉదయం 11.50 గంటలకు ద్రావిడ యూనివర్శిటీలోని హెలిప్యాడ్‌కు చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు యూనివర్శిటీ ఆడిటోరియంకు చేరుకుని ‘స్వర్ణ కుప్పం’ విజన్ 2029ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 2.25 గంటలకు కుప్పం మండలం నడిమూరు గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు సీగలపల్లిలో ప్రకృతి వ్యవసాయ రైతులతో ముచ్చటించి ప్రకృతి వ్యవసాయం విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తారు. సాయంత్రం 5.55 గంటలకు ద్రావిడ యూనివర్శిటీ ఆడిటోరియంలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతారు. రాత్రి 8 గంటలకు కుప్పం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
ఇక రేపు(మంగళవారం) ఉదయం 10 గంటలకు కుప్పం టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12.20 గంటలకు కంగుంది గ్రామం చేరుకుని శ్యామన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5.05 గంటలకు శాంతిపురం మండలం కడపల్లి వద్ద నిర్మిస్తున్న సొంత ఇంటి నిర్మాణాన్ని పరిశీలిస్తారు. సాయంత్రం 6.10 గంటలకు ద్రావిడ యూనివర్శిటీకి చేరుకుని అకాడమిక్ బిల్డింగ్‌లోని కెరీర్ రెడీనెస్ సెంటర్ ప్రారంభిస్తారు. అనంతరం రాత్రి 7.45 గంటలకు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ చేరుకుని అక్కడ బస చేస్తారు. జనవరి 8వ తేదీ ఉదయం 8 గంటలకు కుప్పం నుంచి విజయవాడకు బయలుదేరుతారు. కాగా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నియోజకవర్గం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.