CM ChandraBabu UAE Tour: “ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఇప్పటికే విశాఖపట్నాన్ని ఎంచుకుంది, మరి మీ సంగతేంటి?” అంటూ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే తదుపరి టెక్నాలజీ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చంద్రబాబు పేర్కొన్నారు. యూఏఈ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. రెండోరోజు 12 ప్రముఖ టెక్ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో (సీఈఓ) ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
జీ42ఏఐ సంస్థ ఇండియా సీఈఓ మాన్సూరీ ఏర్పాటు చేసిన ఈ నెట్‌వర్కింగ్ లంచ్, రౌండ్‌టేబుల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పురోగామి విధానాలను, పరిశ్రమల స్థాపనకు అందిస్తున్న వేగవంతమైన అనుమతుల గురించి సమావేశంలో సీఈఓలకు వివరించారు. రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలను, టెక్నాలజీ రంగంలో ఉన్న అపార అవకాశాలను వెల్లడించారు. త్వరలో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాల్సిందిగా సమావేశంలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలందరినీ సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లభించే అవకాశాలను స్వయంగా పరిశీలించాలని పారిశ్రామికవేత్తలను చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించారు. రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో త్వరలో పర్యటిస్తామని పెట్టుబడులపై ఆలోచినస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/raghuram-krishna-raju-strong-warning-to-ys-jagan/
అనంతరం సీఎం చంద్రబాబు అబుదాబిలోని వివిధ పారిశ్రామికవేత్తలతో వన్ టూ వన్ సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏయే ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయనే అంశాలను పారిశ్రామికవేత్తలకు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

అపెక్స్ ఇన్వెస్ట్మెంట్స్, మస్దార్, అగ్తియా గ్రూప్, లులు గ్రూప్ వంటి సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు విడివిడిగా సమావేశమయ్యారు. ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అపెక్స్ ఇన్వెస్టిమెంట్ ఛైర్మన్ ఖలీఫా ఖౌరీ, మస్దార్ సీఈఓ మొహమ్మద్ జమీల్ అల్ రమాహీని చంద్రబాబు కోరారు. విశాఖలో అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్ వస్తున్న నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీపై ఫోకస్ పెట్టామని అపెక్స్, మస్దార్ సంస్థల ప్రతినిధులకు సీఎం తెలిపారు.


