Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan @ Ameen Peer Dargah: పెద్ద దర్గాలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్...

Jagan @ Ameen Peer Dargah: పెద్ద దర్గాలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి

ప్రభుత్వ లాంఛనాలతో దర్గా మజర్ల వద్ద పూల చాదర్

మత సామరస్యానికి ప్రతీకగా, మహిమాన్విత సూఫీగా వెలుగొందుతున్న.. అమీన్ పీర్ దర్గాను సందర్శించడంతో తన జన్మ చరితార్థం అయ్యిందని, ఇది అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కడప అమీన్ పీర్ (పెద్ద దర్గా) దర్గాను సందర్శించి.. ప్రభుత్వ లాంఛనాలతో పూల చద్దార్ సమర్పించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు.. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆది మూల సురేష్,
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీనాథ్ రెడ్డి, నగర మేయర్ సురేష్ బాబు, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, కడప నగర పాలక కమీషనర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… “మత సామరస్యానికి ప్రతీక అయిన కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని ఆనంద పరవశులయ్యారు. ఈ దర్గా ఖ్యాతీ, మహిమలు.. ప్రపంచ వ్యాప్తంగా పరిమళిస్తున్నాయంటే.. కులమత తేడాలు లేకుండా ప్రజలంతా ఐక్యంగా భాగస్వామ్యం కావడమే ప్రధాన కారణం అన్నారు. తాను పుట్టిన సొంత జిల్లాలో.. ఇలాంటి మహత్తరమైన, మహిమాన్వితమైన దర్గా ఉండడం అదృష్టంగా భవిస్తున్నామన్నారు. అంతకు మించి ఆమీన్ పీర్ దర్గాను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆధారిస్తున్న జిల్లా ప్రజలు ఎంతో అదృష్టవంతులన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో.. అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందివ్వగలుగుతున్నామన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పటిష్ఠంగా అమలు చేస్తూ.. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా మైనారిటీ ప్రజల సేవలో తరిస్తున్న.. మిత్రుడు ఎస్.బి.అంజాద్ బాషాకు అభినందనలు తెలుపుకుంటున్నామన్నారు.

మధ్యాహ్నం కడప విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన అమీన్ పీర్ దర్గా ప్రాంగణానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దర్గా ప్రతినిధులు దర్గా సంప్రదాయ లాంఛనాలతో ఘనంగా స్వాగతం పలికారు.

ముందుగా పెద్ద దర్గా ప్రధాన మందిరంలోకి ముఖ్యమంత్రిని సాదరంగా పీఠాధిపతి హరిఫుల్లా హుస్సేని,దర్గా కమిటీ సభ్యులు ఆహ్వానించారు. అనంతరం దర్గా సేవలో నిరంతరం పునీతులవుతున్న.. దర్గా ముజావర్లు,దర్గా కమిటీ సభ్యులను,చౌదరీ కలీఫాలను.. దర్గా పీఠాధిపతులు హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ముఖ్యమంత్రికి పరిచయం చేశారు.

అనంతరం దర్గా పీఠాధిపతుల వారిచే “సూఫీ సర్మాస్త్ సానీ షిలాక్” సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రికి తలపాగా (పేటా) అలంకరణ చేసి, మెడలో షేలా (కండువా), ఇలాచి (దండ) దరింపజేయడం జరిగింది.

తర్వాత పీఠాధిపతులతో కలిసి ముఖ్యమంత్రి అమీన్ పీర్ దర్గా గుమ్మం ముందుకు చేరుకుని.. అక్కడి నారికేళీ రాతిపై కొబ్బరికాయ కొట్టి స్వామివారికి సమర్పించుకున్నారు. అనంతరం ముజావర్లు… పూలు, వస్త్ర చాదర్, సుగంధ పరిమళాల అత్తరుతో కూడిన తట్టను ముఖ్యమంత్రికి అందజేయగా.. ఆయన తలపై పెట్టుకుని భక్తి పరవశ్యమైన మనస్సుతో ప్రధాన దర్గాలో పలికి ప్రవేశించారు. అక్కడ పీరుల్లా మాలిక్ జీవ సమాధి వద్ద గుడ్డ చద్దార్, పూలమాల, అత్తరు సమర్పించిన అనంతరం వారు ఫాతెహ నిర్వహించి ప్రార్థనలు చేశారు.

అక్కడి నుండి నేరుగా అరీఫుల్లా మాలిక్, అమీన్ స్వామి మొదలైన 16 మంది పూర్వపు పీఠాధిపతుల మజార్ల వద్దకు చేరుకుని గంధం, గుడ్డ చాదర్, పూలు సమర్పించారు. అనంతరం.. అక్కడ ఉన్న పూర్వ పీఠాధిపతుల మజార్లకు పూలు సమర్పించి గురువులచే ప్రార్థనలు చేయించారు. అక్కడి నుండి అమీన్ పీర్ దర్గా గ్రంథాలయం చేరుకున్న ముఖ్యమంత్రికి.. పీఠాధిపతుల వారు దర్గా విశిష్టత, ప్రాశస్త్యాన్ని, చారిత్రక వైభవాన్ని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆధ్వర్యంలో అమీన్ పీర్ దర్గా ప్రాంగణం అంతా.. గట్టి పోలీసు భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో.. బద్వేల్ ఆర్డీవో వెంకట రమణ,డీఎస్పీ షరీఫ్,దర్గా మేనేజర్ ఎస్ఎండీ అలీఖాన్, ముజూవర్ అమీర్, దర్గా కో ఆర్డినేటర్ కుతుబుద్దీన్, హజ్ హౌస్ చైర్మన్ గౌసుల్లాజం,ఉర్దూ అకాడెమీ ఛైర్మెన్ నదీమ్,వేర్ హౌస్ ఛైర్మెన్ కరీముల్లా , అహమ్మద్,స్టేట్ మైనారిటీ కమీషన్ మెంబర్ హిదియతుల్లా, నాయకులు అహమ్మద్ భాష,షేక్ ఉమెర్,సయ్యద్ జైద్, డా.సోహేల్,అఫ్జల్ ఖాన్,స్థానిక,రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, దర్గా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News