Weather updates: మన్యంలో చలి పంజా విసురుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండడంతో ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతున్నారు. గత ఐదు రోజులుగా కొయ్యూరు మినహా పది మండలాల్లోనూ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. ముంచంగిపుట్టు మండలంలో అత్యల్పంగా 3.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రతకు ప్రజలు వణికిపోతున్నారు. సీలేరులో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రి, పగలు తేడా లేకుండా చలి ప్రభావం తీవ్రంగా ఉంది. మధ్యాహ్నం మాత్రమే కాస్త ఉపశమనం లభిస్తోంది. తాజా వాతావరణం వల్ల జనజీవనం స్తంభించిపోతోంది.
దట్టంగా పొగమంచు: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని అన్ని మండలాల్లోనూ ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్ముకుంది. ముంచంగిపుట్టు, హుకుంపేట వంటి ప్రాంతాల్లో ఉదయం 9-10 గంటలు దాటినా సూర్యుడు కనిపించడం లేదు. పాడేరు మండలం మినుములూరు పంచాయతీలోని సంగోడి గ్రామ సమీపంలో పంటల వద్ద మంచు గడ్డకట్టింది. వరి గడ్డిపై, టార్పాలిన్‌పై పడిన మంచు ఐస్ మాదిరిగా గడ్డకట్టడాన్ని స్థానికులు గమనించి ఫోటోలు తీశారు.
Also Read:Cold Wave: వామ్మో!.. ఇదేం చలి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు!
రోడ్డు మార్గాలకు అంతరాయం: చలి తీవ్రత పెరగడంతో సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి మొదలవుతోంది. ప్రజలు త్వరగా ఇళ్ల ముఖం పడుతున్నారు. హుకుంపేట మండలంలో దట్టమైన మంచు కారణంగా హైవేపై రోడ్డు మార్గం కనిపించని పరిస్థితి నెలకొంది. వాహన చోదకులు లైట్లు వేసుకొని ప్రయాణాలు సాగిస్తున్నారు. పాడేరు నుంచి అరకులోయ వరకు రోడ్డుపై ఎల్‌ఈడీ లైట్లు వేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. పెదబయలులో ఉదయం 9 గంటలకు ముందు, సాయంత్రం 4 గంటల తరువాత ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నంలో కూడా శీతల గాలులు వీస్తున్నాయి.
చలిమంటలు, ఉన్ని దుస్తులే రక్షణ: చలి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు. పాడేరు, సీలేరు వంటి ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ చలిమంటలు వేసుకుని రక్షణ పొందుతున్నారు. మంచు ఎక్కువగా ఉండడంతో పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.

