Minimum Temperatures drop In AP: ఏపీపై చలి పులి పంజా విసరడం ప్రారంభించింది. చల్లటి గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉత్తరాది గాలులతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చలి ప్రభావం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో మంగళవారం 14.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని అన్నారు. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపారు. శివారు ప్రాంతాలలో మాత్రం చలిగాలులు కొనసాగుతాయని అన్నారు.
ఏజెన్సీ వ్యాప్తంగా పొగ మంచు: గత కొన్ని రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా పొగ మంచు కమ్మేసింది. ప్రయాణికులు మంచు తెరలను చీల్చుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఏజెన్సీ ప్రాంతాన్ని కమ్మేసిన మంచు అందాలు ఇక్కడకు వచ్చే పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. వంజంగిలోని మేఘాలకొండను చుట్టేసిన మంచు దృశ్యాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో అరకు వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చస్తున్నారు. అరకు వంటి ప్రాంతాల్లో 12 డిగ్రీల నుంచి 10 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే ఛాన్స్ ఉందని అధికారులు వాతావరణ నిపుణులు తెలిపారు.
Also Read:https://teluguprabha.net/top-stories/cold-weather-will-increases-in-telangana/
బలహీనపడ్డ ఈశాన్య రుతుపవనాలు: దక్షిణ భారతంలో కొద్దిరోజులుగా ఈశాన్య రుతుపవనాలు బలహీనపడ్డాయని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతం మీదుగా రావల్సిన తూర్పుగాలులు నిలిచిపోయాయని అన్నారు. దీంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాల జాడ లేక నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో పంటల సాగుకు అవరోధం ఏర్పడిందని తెలిపారు. రానున్న నాలుగు రోజుల్లో అక్కడక్కడ తప్ప రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు అన్నారు. అయితే ఈ నెల 19 తర్వాత మార్పులు వచ్చే అవకాశం ఉన్నందున అండమాన్ సముద్రం/ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఆ తర్వాత బలపడి తుపాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపారు. అప్పటివరకూ రాష్ట్రంలో ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అడపాదడపా మాత్రమే వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు పెర్కొన్నారు.


