Friday, July 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Collector: మైనింగ్ మాఫియాపై ఉక్కు పాదం మోపండి

Collector: మైనింగ్ మాఫియాపై ఉక్కు పాదం మోపండి

నంద్యాల జిల్లాలో మైనింగ్ మాఫియాను నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ పోలీస్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ఎస్పి కె.రఘువీర్ రెడ్డితో కలిసి మైనింగ్ మండలాల రెవెన్యూ, పోలీస్ అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ నిశాంతి. టి, ఇన్చార్జి డిఆర్ఓ కామేశ్వరరావు, మైనింగ్ ఏడి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ జిల్లాలోని పాణ్యం, అవుకు, కొలిమిగుండ్ల, బనగానపల్లి, రుద్రవరం, మహానంది, డోన్, బేతంచర్ల, నందికొట్కూరు ఆత్మకూరు తదితర మండలాలలో అక్రమ మైనింగ్ దారులను నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులను ఆదేశించారు. అక్రమ మైనింగ్ పై ప్రతిరోజు వార్తా పత్రికల్లో ప్రతికూల వార్తలు వస్తున్న నేపథ్యంలో…. అనుమతులు తీసుకున్న లీజుదారులను మినహాయించి అక్రమ మైనింగ్ దారులపై ఉక్కు పాదం మోపాలన్నారు. ఇందుకోసం డివిజన్, మండల స్థాయిలో పోలీసు,రెవిన్యూ అధికారులతో కమిటీ బృందాలు ఏర్పాటు చేసి అక్రమ మైనింగ్ స్పాట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆర్డీఓ, ఎస్డిపిఓలను కలెక్టర్ ఆదేశించారు. అలాగే సచివాలయ సిబ్బంది విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీసు తదితరులు తమ పరిధిలోని అక్రమ మైనింగ్ పై సమాచారాన్ని సేకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లీజుదారుల జాబితా డివిజనల్, మండల స్థాయి అధికారులకు పంపిస్తామని లీజు విస్తరణను అధిగమించి అదనపు ఏరియాను ఆక్రమించకుండా సంబంధిత పాయింట్లలో సర్వేయర్లతో హద్దులు ఏర్పాటు చేయాలని మైనింగ్ ఎడిని ఆదేశించారు. అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ దారులను నియంత్రించి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.*

- Advertisement -

అక్రమ బియ్యాన్ని నియంత్రించండి : జిల్లా కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంపై కూడ రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా వుండి నియంత్రించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ నుండి కార్డుదారునికి చేరే వరకు, కార్డుదారు నుండి బియ్యం అక్రమ తరలింపును పూర్తిస్థాయిలో నియంత్రించాలని లేనిపక్షంలో సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇందుకు సంబంధించి డివిజనల్, మండల స్థాయి అధికారులకు సర్కులర్ జారీ చేయాలని ఇన్చార్జి డిఆర్ఓను కలెక్టర్ ఆదేశించారు.జిల్లా ఎస్పి కె.రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ మైనింగ్, అక్రమ బియ్యం సరఫరా నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసు, రెవెన్యూ అధికారులను సూచించారు. ఏ ఏ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్నారు ఆయా ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ఎస్పీ ఆదేశించారు. అక్రమ తరలింపు సమాచారాన్ని కిందిస్థాయి నుండి సేకరించేందుకు గ్రామస్థాయి అధికారులను పటిష్టం చేయాలని ఎస్పీ సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News