YS Jagan| ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ(Gautam Adani ) లంచం ఆరోపణల వ్యవహారం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) మెడకు చుట్టుకునేలా ఉంది. ఇప్పటికే జగన్‌ను అరెస్ట్ చేయాలంటూ కూటమి నేతలు డిమాండ్ చేస్తుండగా.. తాజాగా సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు నలమోతు చక్రవర్తి జగన్‌పై ఏసీబీ(ACB)కి ఫిర్యాదు చేశారు. జగన్‌కు అదానీ సంస్థ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీ విచారణలో తేలిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సంస్థ సెకీతో అదానీ కంపెనీ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పదంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగా భారత్‌లో సోలార్ ఎనర్జీ ఒప్పందాల కోసం అదానీ గ్రూపు రూ.2,029 కోట్లు లంచం ఇవ్వజూపిన ఆరోపణలపై అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా మొత్తం 8 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. విద్యుత్ సంస్థలకు సౌరశక్తిని అమ్మే కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం 2021-24 మధ్య కాలంలో అప్పటి వైసీపీ ప్రభుత్వంతో సహా ఐదు రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులకు రూ. 2,029 కోట్లు లంచంగా చెల్లించారని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. అందులో రూ. 1750 కోట్లు అప్పటి ఏపీ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తికి చెల్లించారని ప్రకటించింది. దీంతో ఆనాటీ సీఎం జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.