– 46 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం
– సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలి
– కాంగ్రెస్ నేత జె. లక్ష్మీనరసింహ యాదవ్
కర్నూలు, (తెలుగు ప్రభ): వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐసీసీ సభ్యుడు, కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జె. లక్ష్మీనరసింహ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 46 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. శుక్రవారం కర్నూలు ధర్నా చౌక్‌లో వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండియా కూటమి నాయకులతో కలిసి ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంట్రాక్టు ఉద్యోగులు అనేక సంవత్సరాలుగా ప్రజలకు నిరంతరాయంగా అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు.
దాదాపు 16 ఏళ్లుగా పారామెడికల్ పోస్టులకు తగిన స్థాయిలో రెగ్యులర్ నియామకాలు జరగకపోవడంతో అర్హత, అనుభవం కలిగిన సిబ్బంది దీర్ఘకాలంగా కాంట్రాక్టు విధానంలోనే కొనసాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రస్తుత కాంట్రాక్టు ఉద్యోగుల అనుభవం, నిరంతర సేవలను పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. టీఏ, డీఏ, హెచ్ఆర్ఏతో కలిపి 100 శాతం గ్రాస్ జీతాన్ని పునరుద్ధరించి అమలు చేయాలని, 2018 నుంచి అమల్లోకి వచ్చిన వేతన తగ్గింపుపై సమీక్ష జరపాలని కోరారు. భవిష్యత్తులో ఖాళీల భర్తీకి రెగ్యులర్ నియామకాల నోటిఫికేషన్లు విడుదల చేసే ముందు ప్రస్తుతం పనిచేస్తున్న అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెంటనే స్పందించాలని లక్ష్మీనరసింహ యాదవ్ కోరారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు జేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసి, నిర్దిష్ట కాలపరిమితిలో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లెనిన్ బాబు, కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ జిలాని భాష, మాజీ డీసీసీ అధ్యక్షుడు కె. బాబురావు, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ డి.వి. సాంబశివుడు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ ఎ. సూర్యప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి రజాక్ వలి, ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం. సుంకన్న, ఐఎన్టీయూసీ సిటీ అధ్యక్షుడు రేపల్లె ప్రతాప్, ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఈ. లాజరస్, యూత్ కాంగ్రెస్ నాయకుడు మహేంద్ర నాయుడు, కాంగ్రెస్ నాయకులు విజయభాస్కర్, వార్డు ఇన్చార్జి షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

