Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్AP PCB: ప్రసాదరావు గారి 'కాలుష్యం'.. ప్రభుత్వాలు మారినా ఏపీ పీసీబీ పగ్గాలు ఈయన చేతుల్లోనే!

AP PCB: ప్రసాదరావు గారి ‘కాలుష్యం’.. ప్రభుత్వాలు మారినా ఏపీ పీసీబీ పగ్గాలు ఈయన చేతుల్లోనే!

Retired APPCB Official Set to Take Key Post in APEMCL: పీ ప్రసాదరావు, పీహెచ్‌డీ. ఏంటీ? ఎవరు ఈయన ? అనుకుంటున్నారా? ఉమ్మడి రాష్ట్రంలో ఈ పేరు తెలియని పారిశ్రామికవేత్తలు లేరు. రాష్ట్ర విభజనకు ముందు రామచంద్రాపురం, జీడిమెట్ల కేంద్రంగా స్థానిక కాలుష్య నియంత్రణ మండలిలో చక్రం తిప్పిన అధికారి ఈయన. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ కు వెళ్లారు. అక్కడ తనదైన ముద్ర వేశారు. విశాఖ కేంద్రంగా ఎల్జీ పాలిమర్స్ కాలుష్య కేసులో సస్పెండ్ అయి అనూహ్యంగా తిరిగి మళ్లీ విధుల్లో చేరి అందరినీ ఆశ్చర్యపరచారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ స్థాయిలో ఉండి ఆ శాఖకే చీఫ్ ఇంజినీర్ హోదాలో విధులు నిర్వహించి, జూన్లోనే రిటైర్ అయ్యారు. ఈ సార్‌కి ఇంకా పర్యావరణ పరిరక్షణ చేయాలన్న కుతూహలం తగ్గనట్టుంది.

- Advertisement -

తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఈఎంసీఎల్) కు ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ గా చేయాలనుకున్నదే తడవుగా దరఖాస్తు చేశారు. ఒకే రోజులో సచివాలయంలో ఆ దరఖాస్తు ముగ్గురు ఉన్నతాధికారుల అనుమతులు పొంది, కొన్ని గంటల వ్యవధిలోనే తదుపరి ఉత్తర్వుల కోసం ఫైల్ డెస్కులో ఎదురుచూస్తోంది. ఇది స్థూలంగా ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మంత్రిత్వ శాఖ దుస్థితి.

ALSO READ: AP Govt: నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు బిగ్‌ రిలీఫ్‌: ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ బకాయిల్లో రూ. 250 కోట్లు విడుదల!

ఆ శాఖ మంత్రి డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ కాలుష్య నివారణ కోసం నడుము కడతానంటూ చేసే ప్రకటనలకుగానీ చేస్తున్న పనులకుగానీ సంబంధం లేదన్నదానికి ఈ ప్రసాద రావు ఉదంతమే ఉదాహరణ. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో జోనల్ అధికారుల నియామకాలను పెండింగ్ లో పెట్టి, వారి స్థానాల్లో కింది స్థాయి ఉద్యోగులతో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా పారిశ్రామిక వాడల్లో కాలుష్యం మరింత పెరుగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈయన స్టైలే వేరు

ఉమ్మడి రాష్ట్రంలోనైనా, ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలోనైనా ఉన్నతాధికారులను, మంత్రులను మచ్చిక చేసుకుని తనకు కావాల్సిన పోస్టులు పొందటం, కోట్లు ఆర్జించటం ఈసార్ కి కొత్తేమీ కాదు. ఫార్మా, బల్క్ డ్రగ్స్, స్టీల్, ఇంజినీరింగ్, సిమెంట్ కంపెనీల లైజనింగ్ ప్రతినిధులతో మాట్లాడినా ఆయా పారిశ్రామికవేత్తలతో ముచ్చటించినా ఈసారు వారి ఘనకార్యాలు చాంతాడంత చెబుతారు.

మొదటి నుంచీ మరకలే

ఉమ్మడి రాష్ట్రంలో రామచంద్రాపురం-జీడిమెట్ల వంటి పీసీబీ ప్రాంతీయ కార్యాలయాల్లో పనిచేసిన సమయంలో ఒకవైపు కాలుష్య కారక కంపెనీలకు నోటీసులు ఇస్తూనే మరోవైపు ఆయా కంపెనీలు జవాబు ఎలా ఇవ్వాలో కన్సల్టెన్సీ చేస్తూ పీసీబీకి ప్రత్యుత్తరాలు ఇచ్చేవారన్న ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీక్ సంఘటనలో ప్రజలు ఉక్కిరిబిక్కిరై రాష్ట్ర ప్రభుత్వ పరువు కూడా పోయింది. దీనిపై ఆగ్రహించిన అప్పటి సీఎం జగన్ ప్రాంతీయ అధికారిగా ఉన్న ప్రసాదరావును సస్పెండ్ చేశారు. ఏడాదిన్నర కాలంపాటు విధుల నుంచి తొలగించారు. వాస్తవానికి ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటే ప్రాధాన్యత ఉన్న పోస్టు ఇవ్వకూడదు. కానీ ఏపీ పీసీబీ ఉన్నతాధికారులు ప్రసాదరావును అందలం ఎక్కించారు. పీసీబీకే చీఫ్ ఇంజినీర్ చేశారు. దీంతో రాష్ట్రంలోని పారిశ్రామికవాడల్లో కాలుష్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధిచెందింది. కర్నూలు టీజీవీ కంపెనీ విస్తరణకు సంబంధించిన అనేక అంశాల్లో ప్రసాదరావు పాత్ర అత్యంత కీలకమైనది.

ALSO READ: AP CM UAE Tour : యూఏఈలో చంద్రబాబు పెట్టుబడుల వేట: మోదీని ప్రశంసించిన ఏపీ సీఎం!

ఏపీఈఎంసీఎల్ పై గురి

కాలుష్య నియంత్రణ మండలిలో పదవీ విరమణ చేసిననాటి నుంచి ప్రసాదరావు వివిధ హోదాల్లో తన హవా కొనసాగించటం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. హఠాత్తుగా అక్టోబర్ రెండవ వారంలో ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ పోస్టు ఖాళీ ఉందని తెలిసి ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నారు.

వాస్తవానికి ఈ సంస్థ 2020లో ప్రభుత్వానికి అనుబంధంగా ఒక ప్రైవేటు కంపెనీగా ఏర్పాటు చేశారు. ఈ సంస్థ రాష్ట్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఉద్యోగుల నియామకాలు, సభ్యుల ఎంపిక ప్రభుత్వమే చేపడుతుంది. ఈ సంస్థ ఏర్పాటైననాడే దీని విధి విధానాలు కూడా ఖరారు అయ్యారు. ఏపీఈఎంసీఎల్ లో ఈడీగా విధులు నిర్వహించాలంటే సదరు అధికారి కాలుష్య నియంత్రణ మండలి చీఫ్ ఇంజినీర్ హోదా స్థాయివారై ఉండాలి. పీసీబీలో ప్రసాదరావు హోదా జాయింట్ చీఫ్ ఇంజినీర్. హోదాకంటే ఎక్కువ స్థాయిలో చీఫ్ ఇంజినీర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఇవన్నీ ప్రభుత్వ పెద్దలను ఆరోజుల్లో ప్రసన్నం చేసుకోవటం ద్వారానే జరిగాయన్నది జగమెరిగిన సత్యం.

జూన్ 2025లో ప్రసాదరావు పదవీ విరమణ చేసే సమయంలో ఆయన హోదా జేసీఈఈనే కానీ సీఈ కాదు. ఈ విషయాన్ని పక్కనపెట్టి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు, మరికొంతమంది అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పటం ద్వారా అర్హత లేని వ్యక్తి అందలం ఎక్కే ప్రయత్నం జరుగుతోంది.

ఎపీఈఎంసీఎల్ ఏం చేస్తుంది?

ఈ సంస్థ ప్రమాదకరమైన రసాయన వ్యర్థాల రాకపోకలను మానిటరింగ్ చేస్తుంది. పరిశ్రమల ఉత్పత్తిలో వెలువడే వ్యర్థాలను రీసైక్లింగ్ లేదా నిర్వీర్యం చేయాలనుకుంటే ముందు ఏపీఈఎంసీఎల్ లో నమోదు కావాల్సి ఉంటుంది. ఇలా నమోదైన కంపెనీలు రాష్ట్రంలోని ఘన వ్యర్థ నిర్మూలనా కేంద్రాలకు అలాగే సిమెంట్ కంపెనీలకు (రసాయన ఘన వ్యర్థాలు కిలాన్ లో వినియోగం) పంపుతుంటాయి. ఆయా వ్యర్థాల సాంద్రత ఆధారంగా, కిలోమీటర్ల ఆధారంగా సెస్ తరహా ఫీజు ఏపీఈఎంసీఎల్ వసూలు చేస్తుంది. కానీ రసాయన, సిమెంట్ కంపెనీలకు ఉత్పత్తిలో వెలువడే వ్యర్థాల నిర్వహణ ఒక పెద్ద సవాలు లాంటిది. ఇక్కడే ఈ సంస్థ ఉన్నతోద్యోగులు అందినకాటికి దండుకునే అవకాశం ఉంది. దీన్ని ఆసరా చేసుకునే ప్రసాదరావు ఈ శాఖ ఈడీ పోస్టు కోసం పావులు కదుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ALSO READ: Speshway Scam : ఉద్యోగం పేరుతో ఉచ్చు.. ‘స్పేష్ వే’ కంపెనీపై కురుస్తున్న ఫిర్యాదుల వర్షం!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad