Saturday, February 22, 2025
Homeఆంధ్రప్రదేశ్APCo: ఆప్కో, కో ఆప్టెక్స్ మధ్య ఎంవోయూ

APCo: ఆప్కో, కో ఆప్టెక్స్ మధ్య ఎంవోయూ

రాష్ట్రంలో తయారవుతున్న చేనేత ఉత్పత్తులకు విస్తృతమైన మార్కెటింగ్ కల్పించే లక్ష్యంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

365 రోజుల పని

చేనేత కార్మికులకు 365 రోజుల పాటు పని కల్పిస్తూ వారు ఆర్థికంగా, సామాజికంగా గౌరవ ప్రదమైన జీవనం సాగించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చేనేత ఉత్పత్తుల అమ్మకాలకు మార్కెటింగ్ ను విస్తరించే పనిలో పడ్డామన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రానికి ఆప్కోను తమళినాడుకు చెందిన కో ఆప్టెక్స్ తో ఎంవోయూ చేసుకోవాలని నిర్ణయించామన్నారు. తమిళనాడుకు చెందిన చేనేత, జౌళి శాఖ మంత్రి ఆర్.గాంధీ, తన సమక్షంలో విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్ లో ఆప్కో, కో ఆప్టెక్స్ ఎండీలు శుక్రవారం ఈ మేరకు ఒప్పందం చేసుకోనున్నట్లు తెలిపారు. ఈ ఎంవోయూతో రెండు చేనేత ఏజెన్సీలు తమ ఉత్పత్తులను కలిపి విక్రయాలు చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు.

షోరూముల్లో

కో ఆప్టెక్స్ కు చెందిన చేనేత వస్త్రాలైన డబుల్ క్లాత్ బెడ్‌షీట్‌లు (కింగ్ సైజు), టర్కీ టవల్స్ (బ్లీచ్డ్ మరియు డైడ్), డోర్‌మ్యాట్‌లు, ఆరని సిల్క్ చీరలు, పళని టై, డై చీరలను ఆప్కో షో రూమ్ ల్లో విక్రయిస్తామన్నారు. మన రాష్ట్రానికి చెందిన మంగళగిరి కాటన్, జారి చీరలు, రాజమండ్రి కాటన్ చీరలు, బందర్ కాటన్ చీరలు, వెంకటగిరి కాటన్ చీరలు, మాధవరం కాటన్ చీరలు, సిల్క్ చీర వంటి చేనేత వస్త్రాలను కో ఆప్టెక్స్ కు షోరూమ్ ల్లో విక్రయిస్తారన్నారు. ఈ ఎంవోయూతో చేనేత వస్త్రాల అమ్మకాలు గణనీయంగా పెరగనున్నాయని, ఏపీ చేనేత ఉత్పత్తులు కో ఆప్టెక్స్ తో కలిసి ప్రపంచ మార్కెట్ లోకి వెళ్లబోతున్నాయని మంత్రి వెల్లడించారు. ఆప్కో, కో ఆప్టెక్స్ చేనేత ఉత్పత్తులు ఒకే షోరూమ్ లో లభ్యం కావడంతో, వినియోగదారుడు తనకు కావాల్సిన, నచ్చిన వస్త్రాలను ఒకే దగ్గర కొనుగోలు చేసుకునే సౌలభ్యం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించడంలో కో ఆప్టెక్స్ తో చేసుకోబోయే ఎంవోయూ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ఇతర రాష్ట్రాల చేనేతతో కూడా ఎంవోయూలు

రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల చేనేత సంస్థలతో కూడా ఎంవోయూలు చేసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. తమ లక్ష్యం చేనేత కార్మికుల ఆర్థిక వృద్ధితో పాటు చేనేత రంగంలో ఏపీని అగ్రగామిగా నిలపడమేనని స్పష్టంచేశారు. ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి సవిత తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News