Homeఆంధ్రప్రదేశ్CPI: కోడుమూరులో తాగునీటి తిప్పలు.. సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌

CPI: కోడుమూరులో తాగునీటి తిప్పలు.. సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌

కోడుమూరు (తెలుగు ప్రభ): దశాబ్దాలుగా కోడుమూరు పట్టణ ప్రజలను వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ నిర్మించి, గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైప్‌లైన్‌ ద్వారా నీటిని తరలించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్‌. లెనిన్‌బాబు డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఆధ్వర్యంలో కోడుమూరులో చేపట్టిన పాదయాత్రకు ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

- Advertisement -

పాలనా మారినా పరిష్కారం లేదు

పాలకులు మారుతున్నా ప్రజా సమస్యలకు మాత్రం పరిష్కారం లభించడం లేదని ఈ సందర్భంగా లెనిన్‌ బాబు అన్నారు. కోడుమూరు పట్టణంలో నేటికీ పది రోజులకు ఒకసారి మాత్రమే కుళాయిల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ నిర్మించి గాజులదిన్నె ప్రాజెక్టుతో పైప్‌లైన్‌ కనెక్టివిటీ కల్పిస్తే పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని తెలిపారు. ఆ దిశగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. 

అస్తవ్యస్తంగా రోడ్లు, డ్రైనేజీ

పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని లెనిన్‌ బాబు ఆరోపించారు. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ బురదమయంగా మారి ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టణంలోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన కోరారు. కోడుమూరులో మార్కెట్‌ యార్డు నిర్మాణం పూర్తయినా ఇప్పటివరకు ప్రారంభించకపోవడం దారుణమన్నారు. మార్కెట్‌ యార్డును తక్షణమే ప్రారంభించి ఈ ఏడాది నుంచే రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

విద్యార్థుల అవస్థలు

పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు ప్రైవేటు కళాశాలలను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్య కోసం కర్నూలు వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు మధ్యలోనే చదువులు మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన కోడుమూరు నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 

కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని సి.బెళగల్‌ మండలంలో గుండ్రేవుల సమీపంలో గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని.. శాశ్వతంగా సాగునీటి సమస్యలు తప్పుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణంలోని పాత గ్రంథాలయం స్థానంలో నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మించాలని, జూనియర్‌ సివిల్‌ కోర్టు, ట్రెజరీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని లెనిన్‌బాబు ప్రభుత్వాన్ని కోరారు. 

కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాధవస్వామి, సీపీఐ మండల, పట్టణ కార్యదర్శులు బి.రాజు, డి.శేషుకుమార్‌, సిపిఐ నాయకులు శివశంకర్‌, ఏఐఎస్ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి, మండల కార్యదర్శి అల్తాఫ్‌, నాయకులు మునిస్వామి, శివ, నరసింహ, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు గడ్డం నాగరాజు, రాజ్‌కుమార్‌, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఈశ్వరయ్యచారి, తిమ్మప్ప, గొల్లరంగడు, గుంటెప్ప, దస్తగిరి, మహిళా సమాఖ్య నాయకురాలు సులోచనమ్మ, చేనేత కార్మిక సంఘం నాయకులు మల్లయ్య, గోపాల్‌, శేఖర్‌, ఆటో యూనియన్‌ నాయకులు బోయ రామకృష్ణ, బోయ రామాంజనేయులు, ఏఐవైఎఫ్‌ నాయకులు మహేష్‌నాయుడు, మహేష్‌, సురేంద్ర, రైతు సంఘం నాయకులు గొల్లరాజు, రాముడు, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News