CREDAI Property Show in Vishakhapatnam: డిసెంబర్ 19 నుంచి మూడు రోజుల పాటు విశాఖ నగరంలో క్రెడాయ్ ఎక్స్‌పో జరగనుంది. గాదిరాజు ప్యాలెస్‌లో ‘క్రెడాయ్’ 11వ ప్రాపర్టీ ఎక్స్‌పో-2025 నిర్వహించనున్నట్లు సంస్థ నిర్వాహకులు శనివారం తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో విశాఖ జోనల్ చైర్మన్ ధర్మేందర్ వరదా, అధ్యక్షులు ఈ.అశోక్ కుమార్, కార్యదర్శి వి.శ్రీను, సంయుక్త కార్యదర్శి/కార్యక్రమ కన్వీనర్ సీహెచ్ గోవిందరాజు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తగరపువలస నుంచి అగనంపూడి వరకు విస్తరించి ఉన్న అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మాణదారులు, వినియోగదారుల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకే ఈ ఎక్స్‌పో నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం, క్రెడాయ్ విశాఖపట్నం చాప్టర్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా గృహ నిర్మాణదారులకు బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకొచ్చాయని, వినియోగదారుల సౌకర్యార్థం నిర్మాణ సామగ్రి, అధునాతన ఇంటీరియర్ తదితరాల్ని ఈ ఎక్స్‌పో ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. ఏపీ ప్రభుత్వం సడలించిన మార్పులకు అనుగుణంగా నిర్మాణాలను చేపట్టడంతో పాటు వినియోగదారుల్ని అన్ని విధాల సంతృప్తి పరిచేలా ప్రాజెక్టులు చేపట్టేందుకు ఈ ఎక్స్‌పో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
జీఎస్టీ తగ్గింపుతో ఎన్నో ప్రయోజనాలు..
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అందుబాట్లోకి తీసుకొచ్చిన జీఎస్‌టీ 2.0 వల్ల వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని క్రెడాయ్ ప్రతినిధులు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ వల్ల అనుమతులు సులభతరంగా మారాయని, అందుకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. జీఎస్టీ ప్రభావంతో ఇసుక ధర గతం కంటే తగ్గిందని, స్టీల్ వినియోగం పెరిగిందని, సిమ్మెంట్‌పై 28 శాతం నుంచి 18 శాతానికి జీఎస్‌టీ తగ్గడం వల్ల ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉందన్నారు. అయితే, కంపెనీలు మాత్రం ధరల్ని పెంచేసి ఆ మేరకు జీఎస్‌టీ తగ్గించామని చూపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిమెంటు కంపెనీలను ప్రభుత్వం కట్టడి చేసి జీఎస్టీ ప్రయోజనాలను నేరుగా వినియోగదారులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అందులో క్రెడాయ్ భాగస్వామ్యం కూడా ఉంటుందన్నారు. క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్‌పోను విశాఖ నగరవాసులాంతా సద్వినియోగం చేసుకోవాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.


