ఫేస్ బుక్ లో పరిచయమైంది. మెసేజ్ లో మెస్మరైజ్ చేసింది. మాటలతో మైమరపించింది. తాను ఆస్తులున్న వ్యక్తినని చెప్పింది. ఐ లవ్ యూ అంది. పెళ్లి చేసుకుందామంది. ఇంకేముంది మనోడు.. పంట పండిందనుకున్నాడు. పెళ్లికి ఓకే.. కానీ అంతలోనూ ట్విస్ట్ ఇచ్చింది. ఆస్తులైతే ఉన్నాయి కానీ.. అవి కోర్టుల్లో ఉన్నాయని, వాటిని విడిపించుకోవాలని చెప్పింది. వాయిదాలకు లాయర్ కు డబ్బిచ్చేందుకు తన వద్దలేవని సాయం చేయాలని కోరింది. ఆ మాటలకు పూర్తిగా బోల్తా పడ్డాడు. అడినప్పుడల్లా డబ్బిచ్చాడు. వన్ ఫైన్ డే మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
ఈ కిలాడీ లేడీ యువకుడిని మోసం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. చిత్తూరు జిల్లాకు చెందిన అపర్ణ అలియాస్ శ్వేత.. బాధిత యువకుడికి ఫేస్ బుక్ లో పరిచయమైంది. తనకు భారీగా ఆస్తులున్నాయని ఆ యువకుడ్ని నమ్మించింది. ఆస్తులు కోర్టులో ఉన్నాయని, వాటిని విడిపించుకోవాలని చెప్పింది. అందుకు డబ్బు అవసరం అంటూ ఆ యువకుడి నుంచి పలు దఫాలుగా రూ.46 లక్షల వరకు వసూలు చేసింది. అపర్ణ ప్రవర్తనపై అనుమానం వచ్చిన యువకుడు, మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అపర్ణను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, ట్యాబ్ స్వాధీనం చేసుకున్నారు.