Cyclone Warning: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని వణికిస్తోంది. అమరావతి వాతావరణ శాఖ సంచాలకులు స్టెల్లా తెలిపిన వివరాల ప్రకారం, ఈ అల్పపీడనం ఆదివారం (అక్టోబరు 26) సాయంత్రానికి వాయుగుండంగా, సోమవారం (అక్టోబరు 27) నాటికి తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావంతో ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
ప్రజలు, ముఖ్యంగా తీర ప్రాంతంలో నివసించే వారు, మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్టెల్లా సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత శిబిరాలకు తరలించడానికి అధికారులకు వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
హోంమంత్రి సమీక్ష – యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు
తుపాను ముప్పు నేపథ్యంలో, రాష్ట్ర హోంమంత్రి అనిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శనివారం, ఆదివారం రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు మంత్రికి వివరించారు. తుపాను తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేసి, ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని హోంమంత్రి స్పష్టం చేశారు.
వర్షాలు, ఈదురు గాలుల కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ముందు జాగ్రత్త చర్యలను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. సహాయక చర్యల కోసం విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్లు 112, 1070, 18004250101 లకు ప్రజలు ఫోన్ చేయవచ్చని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆహారం అందించాలని ఆదేశించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండి, తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని దిశానిర్దేశం చేశారు.


