Cyclone Fengal| బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుపాను శనివారం సాయంత్రం తమిళనాడు తీరాన్ని తాకింది. తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 90 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై నగరంతో పాటు పలు జిల్లాల్లో వరదు నీరు రోడ్డుపైకి చేరుకుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా విశాఖపట్టణం (Vizag) నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. తిరుపతిలో భారీ వర్షాల కారణంగా విశాఖ-తిరుపతి విమాన సర్వీసులను రద్దు చేశారు. మరోవైపు విశాఖ-చెన్నై విమాన సర్వీసులను కూడా రద్దు చేసినట్లు విమనాశ్రయ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే చెన్నై విమానాశ్రయంలో(Chennai International airport) నీరు చేరడంతో విమానాలు ల్యాండింగ్, టేకాఫ్‌కు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. దీంతో పలు విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే ఓ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo flight) ఎయిర్‌బస్ విమానం ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించగా నియంత్రణ కోల్పోయి గాల్లో చక్కర్లు కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.