AP govt announces holidays: మొంథా తుపాను ప్రభావంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఎప్పటికప్పుడు తుపాన్ సమాచారాన్ని ప్రజలు అందిస్తూ.. తగు జాగ్రత్తలు సూచిస్తున్నారు. అంతేకాకుండా 22 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సెలవులు ఇవ్వలేదు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే కాకినాడలో ఇవాల్టి నుంచి 31వ తేదీ వరకు హాలిడేస్ ప్రకటించారు. మిగతా జిల్లాల్లో 1 నుంచి 3 రోజుల వరకు సెలవులు ఉంటాయని తెలిపారు . మొంథా తుపాను ప్రభావం కాకినాడ తీరంపై ఎక్కువ ఉండే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. మంగళవారం రాత్రి నాటికి కాకినాడ సమీపంలో.. మొంథా తుపాను తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: మొంథా తుఫానును దృష్టిలో ఉంచుకుని.. విద్యార్థుల భద్రత, క్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించినట్టు అధికారులు తెలిపారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప జిల్లాల కలెక్టర్లు అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 31 వరకు ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు సెలవులు ప్రకటించినట్టు ఇంటర్మీడియట్ బోర్డు పేర్కొంది. ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని బోర్డు శాఖ ఫీల్డ్ అధికారులను ఆదేశించింది. విద్యార్థులు తమ ఇళ్లలోనే ఉండేలా చూసుకోవాలని తల్లితండ్రలకు పలు సూచనలు చేసింది. సంబంధిత జిల్లా కలెక్టర్లు సెలవు దినాలుగా ప్రకటించిన రోజుల్లో ఏ సంస్థ పనిచేయకూడదని పేర్కొంది. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే.. తీవ్రంగా పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బోర్డు హెచ్చరించింది.
నేడు 7 జిల్లాలకు రెడ్ అలెర్ట్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. దీంతో 7 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. మిగితా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. తూర్పుగోదావరి, ఏలూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది.


