Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Montha Cyclone: ముంచేసిన మొంథా.. ఆరుగురి మృతి.. ఇద్దరి గల్లంతు!

Montha Cyclone: ముంచేసిన మొంథా.. ఆరుగురి మృతి.. ఇద్దరి గల్లంతు!

Cyclone Montha Effect updates: మొంథా తుపాను మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జన జీవనాన్ని స్తంభించింది. ఈశాన్య రుతుపవనాల కాలంలో ఏర్పడిన తొలి తీవ్ర తుపాను ‘మొంథా’ తీవ్ర నష్టాన్ని చేసి వెళ్లింది. అతిభారీ వర్షాలు, బలమైన గాలులతో తీరప్రాంతాలతో పాటుగా ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్ని ముంచేసింది. కావలిలో రాష్ట్రంలోనే అత్యధిక వాన కురవడం దీని తీవ్రతకు నిదర్శనం. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ భారీవర్షాలతో వాగులు వకంలు పొంగి ప్రవహించాయి. సముద్రం 20-30 మీటర్లు ముందుకొచ్చిందిని అధికారులు తెలిపారు. వందల గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో సరఫరా స్తంభించింది. ప్రభుత్వ చర్యలతో చాలాచోట్ల అధికారులు పునరుద్ధరించారు.

- Advertisement -

పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు: నెల్లూరు జిల్లాలో గాలుల తీవ్రతకు పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రూ.96.24 కోట్ల మేర నష్టం వాటిల్లిందని జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా నిర్ధారించి ప్రభుత్వానికి అందజేసింది. కందుకూరు దగ్గర ఎర్రవాగు, ఉదయగిరి మండలంలో దున్నపోతుల వాగు, వలేటివారిపాలెం పందివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఒంగోలు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల చెరువులు పూర్తి స్థాయిలో నిండి.. అలుగు పడడంతో ఆ నీరంతా ఒంగోలు పట్టణంవైపు ప్రవహించింది. దీంతో బిలాల్‌నగర్, పాపాకాలనీ, కరుణాకాలనీ, హౌసింగ్‌బోర్డు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. 600 ఇళ్లలోకి సుమారు నాలుగున్నర అడుగుల వరకు నీరు చేరింది. మరికొన్ని చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి.

Also Read:https://teluguprabha.net/telangana-news/cyclone-montha-effect-updates-in-telangana-2/.

రహదారులపై ఉప్పొంగిన వర్షపునీరు: గుంటూరు జిల్లాలో 9,472 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టుగా జిల్లా అధికారులు తెలిపారు. ఈదురుగాలులకు 104 చెట్లు, 67 స్తంభాలు నేలకొరిగి.. సరఫరా స్తంభించింది. పెదనందిపాడు-బాపట్ల మార్గంలో నాగులపాడు సబ్‌స్టేషన్‌ వద్ద భారీవృక్షం రోడ్డుపై పడటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గుంటూరు-పర్చూరు మార్గంలో అబ్బినేనిగుంటపాలెం వద్ద రహదారిపై వర్షపునీరు ఉప్పొంగి ప్రవహించింది.

 విరిగిపడ్డ కొండచరియలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో మహానంది వైపు వాహనాల రాకపోకలు స్తంభించాయి. కొత్తపల్లి మండలంలోని శివపురం గ్రామం దగ్గర పెద్దవాగు పొంగి రహదారిపై నుంచి వర్షపునీరు ప్రవహిస్తుండడంతో.. 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. నంద్యాల పట్టణం సైతం పూర్తిగా జలమయమైంది. ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న భవనాశి వాగు, గుండ్లకమ్మ, పీతిరివాగులు ఉప్పొంగడంతో మార్కెట్‌యార్డ్, ఇందిరానగర్, సాయిబాబానగర్, ఏకలవ్యనగర్, రహమత్‌నగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీశైలం-హైదరాబాద్‌ మార్గంలో గల సున్నిపెంట వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి.

Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/deputy-cm-pawan-kalyan-reviews-post-cyclone-situation-deploys-21055-staff-for-sanitation-and-water-supply-restoration/

పునరుద్ధరణకు మరింత సమయం: కాకినాడ నుంచి ఉప్పాడకు వెళ్లే రహదారి.. పెనుగాలులతో పూర్తిగా ధ్వంసమైపోయింది. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి, శరభవరం మధ్య వాగు జోరుగా ప్రవహించడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలను పూర్తిగా నిలిచిపోయాయి. కాకినాడ జిల్లాలో 70, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 99 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. కోనసీమ జిల్లాలోని పలు మండలాలు, అనేక గ్రామాల్లో మంగళవారం రాత్రి నుంచి విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పునరుద్ధరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఆరుగురి మృతి.. ఇద్దరి గల్లంతు!: మొంథా తుపాను ఆరుగురిని పొట్టన పెట్టుకుంది. మరో ఇద్దురు గల్లంతయ్యారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో గల పొట్టేళ్లవాగులో పడి జయమ్మ అనే వృద్ధురాలు మృతిచెందారు. చలి తీవ్రతకు బాపట్ల జిల్లా అద్దంకిలో రేఖానార్‌ లక్ష్మి(61), హనుమంతరావు(84) అనే ఇద్దరు వృద్ధులు మృతిచెందారు. కృష్ణా జిల్లాలో కొబ్బరిచెట్టు మీద పడటంతో సుబ్బారావు (54) అనే వ్యక్తి మరణించారు. ఇదే జిల్లాలో గంగూరుకు చెందిన వనం అన్నపూర్ణ(64) అనే వృద్ధురాలు చలిగాలుల తీవ్రతను తట్టుకోలేక మృతి చెందారు. పల్నాడుజిల్లా వినుకొండ ఆకులవారి వీధిలో ఒంటరిగా ఉండే మర్రెడ్డి రాములమ్మ (90) అనే వ్యక్తి గోడ కూలి మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లా పాములపాడు మండలంలోని భవనాశి వాగు ఉద్ధృతికి నాగేశ్వరరావు గల్లంతయ్యారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో సవర లోభానా(40) అనే మరో వ్యక్తి గల్లంతయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వందల పశువులు మృత్యువాత పడ్డాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad