Daggubati Puramdhareshwari: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిన్నమ్మగా అందరికీ పరిచయమైన దగ్గుబాటి పురంధరేశ్వరి రాజకీయ సన్యాసంపై మరోసారి వార్తలు విన్పిస్తున్నాయి. ఈసారి కుమారుడు ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు మార్గం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాజమండ్రి లోక్‌సభ నుంచి ఎంపీగా ఉన్న దగ్గుబాటి పురంధరేశ్వరి త్వరలో రాజకీయాలకు బైబై చెప్పనున్నారనే వార్తలు గట్టిగా వ్యాపిస్తున్నాయి. మూడు సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె ఇక రాజకీయాలు వదిలేసి కుమారుడి రాజకీయ భవితవ్యంపై ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. దగ్గుబాటి పురంధరేశ్వరి తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి. 2004 ఎన్నికల్లో బాపట్ల లోక్‌సభ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి గెలిచారు. రెండోసారి ఎంపీగా గెలిచిన తరువాత అప్పటి యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. కొద్దికాలం హెచ్‌ఆర్‌డి మంత్రిగా, కొద్దికాలం వాణిజ్య శాఖ మంత్రిగా చేశారు.
బీజేపీలో చేరిక
ఆ తరువాత 2014 ఎన్నికలకు కొద్గిగా ముందు కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అంతేకాకుండా రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2019 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంటే రెండు సార్లు ఎంపీగా గెలిస్తే మరో రెండు సార్లు ఓడిపోయారు. ఇదే 2019 ఎన్నికల్లో ఆమె భర్త, కుమారుడు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పర్చూరు నుంచి కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ పోటీ చేయాల్సిన పరిస్థితి. కానీ పౌరసత్వం సమస్య కారణంగా తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు.
రాజకీయాలకు బై బై..?
ఈ క్రమంలో 2019లోనే దగ్గుబాటి పురంధరేశ్వరి రాజకీయాలకు వీడ్కోలు చెబుతారనే వార్తలు గట్టిగా విన్పించాయి. కానీ ఆ పుకార్లను ఆమె కొట్టిపారేశారు. ఆ తరువాత కూడా బీజేపీలో కొనసాగుతూ వచ్చారు. తాజాగా 2024 ఎన్నికల్లో కూటమిలో భాగంగా బీజేపీ తరపున రాజమండ్రి నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి ఆమె బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. ఇప్పుడిక రాజకీయాలకు స్వస్తి చెప్పి కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం మార్గం సిద్ధం చేయనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడు కుటుంబాల మధ్య గతంలో ఉన్న విబేధాలు ఇప్పుడు తగ్గిపోయి సయోధ్య నెలకొన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రానున్న 2029 ఎన్నికల్లో కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్‌ను తెలుగుదేశం పార్టీ తరపున బరిలో నిలిపేందుకు సిద్ధమౌతున్నారని సమాచారం. చంద్రబాబు సైతం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా పార్టీ వర్గాల్లో విన్పిస్తోంది.


