Davos 2026: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక విప్లవాన్ని వేగవంతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్‌లో తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 2025లో జరిగిన దావోస్ పర్యటన ద్వారా ఇప్పటికే రూ. 2.50 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని, ఈ ఏడాది మరిన్ని భారీ ప్రాజెక్టులపై దృష్టి సారించామని సీఎం వివరించారు.
విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న TCS డెవలప్‌మెంట్ సెంటర్, అమరావతిలో ప్రతిపాదిత క్వాంటం వ్యాలీ, కర్నూలులో తలపెట్టిన సోలార్ పవర్ ప్రాజెక్టుల పనులను మరింత వేగవంతం చేయాలని చంద్రబాబు కోరారు. దీనికి చంద్రశేఖరన్ సానుకూలంగా స్పందిస్తూ, పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన ఈ హబ్ కార్యకలాపాలపై చర్చించారు. దీనిపై తదుపరి చర్చల కోసం టాటా ట్రస్ట్ నుంచి ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏపీకి పంపనున్నట్లు చంద్రశేఖరన్ తెలిపారు.
Also Read: Vijayasai Reddy – జగన్ కోటరీపై విజయసాయిరెడ్డి నిప్పులు
టాటా పవర్ ద్వారా నెల్లూరులో సుమారు రూ. 6,675 కోట్లతో దేశంలోనే అతిపెద్ద సోలార్ ఇంగాట్ , వేఫర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో పర్యాటక రంగం (Tourism) అభివృద్ధికి టాటా గ్రూప్ చొరవ చూపాలని, ముఖ్యంగా విశాఖ, అమరావతి వంటి ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని సీఎం సూచించారు. వీటితో పాటు ఏపీలో 3 స్పోర్ట్స్ సిటీల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, క్రీడారంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు.
“యువశక్తి, పాలసీలు, సమర్థ నాయకత్వం ఉన్న ఏపీని బ్రాండ్ చేయడానికి దావోస్ ఒక అద్భుత వేదిక” అని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చంద్రశేఖరన్ తన అనుభవాలను పంచుకుంటూ, భారత్ పట్ల అంతర్జాతీయ దిగ్గజ సంస్థల ఆసక్తి పెరిగిందని, ఏపీ ఇందులో కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు.

