గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదని.. వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విమర్శించారు. కర్నూలు జిల్లా పూడిచర్లలో పంట కుంట నిర్మాణానికి పవన్ భూమిపూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంట కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ కింద సొంత గ్రామాల్లోనే పనులు కల్పించామన్నారు. ఉపాధిహామీ కింద ఇప్పటి వరకు రూ.9,597 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వంద మందికిపైగా నివసిస్తున్న గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పించామని.. విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులకు నిధులు కేటాయించామని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు(Chandrababu) నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను పటిష్ఠం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. బలమైన, అనుభవజ్ఞులైన సీఎం ఉండబట్టే పల్లె పండుగ విజయవంతమైందన్నారు. కర్నూలు జిల్లాలో రూ.75 కోట్లతో 117 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేమాన్నారు. జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా 98 శాతం రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. నీటిని నిల్వ చేసుకోగలిగితే ఎలాంటి సమస్య ఉండదన్నారు. వర్షాలు రాగానే పంట కుంటలు నిండేలా ప్రణాళికలు చేస్తామని పవన్ వెల్లడించారు.