Pawan Kalyan Abhinava Krishna Devaraya: కర్ణాటకలోని ఉడిపిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఉడిపి పుట్టిగే పీఠాధిపతి సుగుణేంద్ర స్వామీజీ.. పవన్‌ను అరుదైన బిరుదుతో గౌరవించారు. ఆయనకు ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదును ప్రదానం చేశారు.

పర్యాయ పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బృహత్ గీతోత్సవ’ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ కృష్ణ దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం కార్యక్రమంలో పవన్ మాట్లాడారు. భగవద్గీత ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శి అని వ్యాఖ్యానించారు. ధర్మ స్థాపనకే తన రాజకీయ ప్రస్థానమని.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే 21 స్థానాల్లో పోటీ చేశానని స్పష్టం చేశారు. ఏపీ ఎన్నికలకు ముందు తాను కూడా అర్జునుడిలాంటి సందిగ్ధతను ఎదుర్కొన్నానని తెలిపారు. అనంతరం ప్రతి ఒక్కరి జీవితంలో భగవద్గీత ప్రాముఖ్యత గురించి తెలియజేశారు.
‘భగవద్గీత అనేది కేవలం ఒకసారి చదివి, ఎర్ర వస్త్రంలో చుట్టి పూజాగదిలో పెట్టే గ్రంథం కాదు. జీవితంలో ఎదురయ్యే ప్రతి నిర్ణయంలో, ప్రతి గందరగోళంలో, ప్రతి అంతర్గత పోరాటంలో గీత మనతోనే నడుస్తుంది. మన కురుక్షేత్రాల్లో స్థిరమైన తోడుగా నిలుస్తుంది. నేటి తరం యువత నిరంతరం సమాచార వెల్లువ, వృత్తిపరమైన ఒత్తిడి, గుర్తింపు సంక్షోభం, వైఫల్య భయాలు వంటి ఆధునిక కురుక్షేత్రాలను ఎదుర్కొంటోంది. వారికి ఈ సమయంలో మానసిక బలం అత్యంత అవసరం. భావోద్వేగ నిలకడను గీత అందిస్తుంది.’ అని పవన్ అన్నారు.

వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర సమగ్ర శ్రేయస్సే ముఖ్యమని పవన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రిగానో, ప్రజాసేవకుడిగానో రాలేదని చెప్పారు. ధర్మాన్ని అన్వేషించే ఒక వినయపూర్వక సాధకుడిగా మాత్రమే వచ్చానని.. సరైన పాలన, సేవ, బాధ్యతలతో కూడిన ప్రతి చర్య నిజమైన నాయకత్వానికి నిదర్శనమని పవన్ స్పష్టం చేశారు. ధర్మాన్ని కాపాడితే.. అది మిమ్మల్ని కాపాడుతుందన్నారు. తన గోశాలలో 60 గోవులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆవును సంరక్షించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
‘మన కర్మభూమి ఎన్నో దండయాత్రలను తట్టుకుని నిలబడింది ఆయుధాలు, సంపదతో కాదు. ధర్మాన్ని సజీవంగా ఉంచిన గ్రంథాలు, సంప్రదాయాలు, సాధువులు, పవిత్ర సంస్థల వల్లనే పటిష్ఠంగా నిలబడ్డాం. ఐన్‌స్టీన్ నుంచి ఓపెన్‌హైమర్ వరకు ఎందరో ప్రపంచ మేధావుల ఆలోచనలను గీత శతాబ్దాలుగా ప్రభావితం చేస్తోంది. ఉడిపి వంటి పుణ్యక్షేత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు సమావేశమైనప్పుడు ‘వసుధైక కుటుంబం’ అనే ప్రాచీన భారతీయ దార్శనికతకు జీవం పోస్తారు. ఇదే నేడు ప్రపంచానికి భారత్ అందిస్తున్న సందేశం. జగద్గురు మధ్వాచార్యుల శాశ్వత వారసత్వం ద్వారా మన ఆధ్యాత్మిక సంపదను కాపాడిన వారిని స్మరించుకోవాలి.’ అని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ పిలుపునిచ్చారు.

