Cyclone Montha: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా‘ తుపాను తీరం దాటే ముప్పు నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం (అక్టోబర్ 25, 2025) కాకినాడ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం మొంథా తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
ఈ హెచ్చరికల నేపథ్యంలో, పవన్ కల్యాణ్ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ , ఇతర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తీరప్రాంత నియోజకవర్గాలైన తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, తాళ్లరేవు మండలాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ అంచనాల దృష్ట్యా, ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ప్రజల రక్షణే ప్రథమ లక్ష్యం:
తుపానుపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, తీర ప్రాంత గ్రామాల ప్రజలను సురక్షిత సహాయ కేంద్రాలకు తరలించాలని ఉపముఖ్యమంత్రి సూచించారు. సహాయక కేంద్రాల్లో ఆహారం, ఔషధాలు, తాగునీరు, పాలు వంటి నిత్యావసరాలను సమకూర్చాలని ఆదేశించారు. రెవెన్యూ, వ్యవసాయం, నీటిపారుదల, పోలీస్, అగ్నిమాపక శాఖలతో పాటు విపత్తు ప్రతిస్పందన దళాలను (NDRF/SDRF) సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా, ఉప్పాడ సమీపంలో సముద్ర తీరం కోతకు గురయ్యే ప్రాంతంలో మత్స్యకారులను ముందస్తుగా హెచ్చరించాలని సూచించారు.
ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఆరా:
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఆరా తీశారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేరువగా నీటి నిల్వలు పెరుగుతున్నాయని, నీటిని విడుదల చేసేటప్పుడు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తామని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. తుపాను కారణంగా ముంపు పరిస్థితులు తలెత్తితే నీటిపారుదల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని, రైతులు, ప్రజలకు సకాలంలో సమాచారం అందించాలని ఉపముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.


