Pawan kalyan: విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం విశాఖలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశ్రమల యాజమాన్యాల సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు.
అభివృద్ధి-పర్యావరణం మధ్య సమతుల్యం: రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పరిశ్రమలు ఎంత అవసరమో.. ప్రజల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కాలుష్యాన్ని పూర్తిగా నివారించలేకపోయినా నూతన సాంకేతికతతో దాన్ని నియంత్రించవచ్చని తెలిపారు. పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. కేవలం లాభాలే ధ్యేయంగా కాకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.
ఉత్తరాంధ్రలో ఆందోళనకర పరిస్థితులు: పారిశ్రామిక వ్యర్థాల కారణంగా తాడి గ్రామం వంటి ప్రాంతాల్లో ఇంటికొకరు క్యాన్సర్ బారిన పడటం, చిన్నారుల్లో చర్మ వ్యాధులు, మహిళల్లో గర్భస్రావాలు కలచివేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ పోర్టు పరిసరాల్లో బొగ్గు కాలుష్యం వల్ల ప్రజలు ఊపిరితిత్తుల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇలాంటి సమస్యలపై యాజమాన్యాలు మానవతా దృక్పథంతో స్పందించాలని కోరారు. ఉత్తరాంధ్రను కాలుష్యానికి డంపింగ్ యార్డ్‌గా మార్చారనే భావన ప్రజల్లో బలంగా ఉందని తెలిపారు. దానిని పోగొట్టాల్సిన బాధ్యత పరిశ్రమలదేనని పేర్కొన్నారు.
గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు: పర్యావరణ పరిరక్షణలో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గ్రేట్ గ్రీన్ వాల్” ప్రాజెక్టులో పరిశ్రమలు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. 970 కిలోమీటర్ల తీర ప్రాంతంలో మూడు బఫర్ జోన్లుగా మొక్కలు నాటడం ద్వారా తీరానికి రక్షణ కల్పించవచ్చని వివరించారు. ప్రతి పరిశ్రమ నిబంధనల ప్రకారం 33 శాతం గ్రీన్ బెల్ట్‌ను అభివృద్ధి చేయాలని సూచిస్తూ.. పర్యావరణ హామీలను నెరవేర్చాలని ఆయన స్పష్టం చేశారు.

