Godavari Pushkara Ghats: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించారు. గోదావరి నదీ తీరాన గల పుష్కర ఘాట్ల వద్ద ప్రస్తుతం జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఘాట్ల ఆధునీకరణ, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి డిప్యూటీ సీఎంకు తెలియజేశారు.
బోటులో క్షేత్రస్థాయి పరిశీలన: పుష్కర ఘాట్ వద్ద పరిశీలన ముగిసిన అనంతరం.. పవన్ కల్యాణ్ అక్కడి నుండి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణించారు. నదీ మార్గంలో సాగుతున్న అఖండ గోదావరి ప్రాజెక్టు పనుల వివరాలను, భవిష్యత్తు ప్రణాళికలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆయనకు వివరించారు.
Also read-Rohini Karte: నేటి నుండి రోహిణి కార్తె షురూ.. అగ్నిగుండంగా తెలుగు రాష్ట్రాలు!
కాలుష్య నివారణే ధ్యేయం: గోదావరి నది పవిత్రతను కాపాడటంతో పాటు.. నదీ జలాలు కలుషితం కాకుండా చూడటంపై ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ఘాట్ల వెంట కాలుష్య నివారణకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులకు తెలిపారు. వ్యర్థాలు నదిలోకి చేరకుండా చేపట్టాల్సిన శాశ్వత చర్యల గురించి పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎంతో పాటు జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

