నట సింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna)కు పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభినందనలు తెలియజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘యూఫోరియా మ్యూజికల్ నైట్’ (Euphoria Musical Night) ఈవెంట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రేమగా బాలయ్య అని పిలవమంటారని కానీ ఆయనంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. అందుకే బాలకృష్ణను సార్ అని పిలవడమే తనకు ఇష్టమని తెలిపారు.
ఒకటి రెండు కాదు ఎన్ని తరాలు వచ్చినా సరే ప్రేక్షకులను ఆకర్షించే ఆయన నటన హర్షణీయమని కొనియడారు. సినిమాల్లోనే కాదని సేవల్లోనూ బాలయ్య ముందుంటారని చెప్పారు. ఆ సేవలను గుర్తించిన ప్రధాని మోడీ సర్కార్ ఆయనకు పద్మభూషణ్ ఇచ్చి గౌరవించిందని వెల్లడించారు. తలసేమియా బాధితుల కోసం నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఎలాంటి ప్రచార హంగామా లేకుండా సేవ చేసుకుంటూ వెళ్లడం ఎన్టీఆర్ ట్రస్ట్‌కు ఉన్న ప్రత్యేకత అని ప్రశంసించారు. మరో వందేళ్ల పాటు ఇది కొనసాగాలని.. తన వంతుగా ఎన్టీఆర్ ట్రస్ట్‌కు రూ.50లక్షలు విరాళమిస్తున్నానని తెలిపారు.

కాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నేతృత్వంలో ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ కార్యక్రమం శనివారం రాత్రి గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు(Chandrababu), మంత్రి నారా లోకేష్(Nara Lokesh), తదితర నేతలు హాజరయ్యారు.

