Deputy CM Pawan Kalyan: తుపాను ముప్పును సమర్థంగా ఎదుర్కొన్నామని ఊపిరి పీల్చుకునే లోపే, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య రక్షణే తదుపరి అతిపెద్ద సవాలుగా మారింది. మొంథా తుపాను బీభత్సం తగ్గినప్పటికీ, గ్రామాల్లోని పారిశుద్ధ్య, తాగునీటి సమస్యలు ప్రజల ప్రాణాలకే ముప్పుగా మారే ప్రమాదం ఉంది. దీనిని గుర్తించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ , మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో తక్షణమే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాటల్లోని నిశ్చయం యుద్ధ సన్నాహాన్ని తలపించింది. “తుపానును ఎదుర్కోవడం ఒక ఎత్తైతే, తదుపరి చర్యలే అత్యంత కీలకం,” అంటూ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖలను యుద్ధప్రాతిపదికన పనిచేయాలని ఆదేశించారు.
1583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దెబ్బతిన్న రోడ్లు (38 చోట్ల), రహదారులపై గుంతలు (125 చోట్ల) ప్రజల రాకపోకలను అడ్డుకుంటున్నాయని తెలిపారు. అయితే, ఉప ముఖ్యమంత్రి దృష్టి అంతా పారిశుద్ధ్యంపైనే.
అంటువ్యాధులకు అడ్డుకట్ట..
గ్రామాల్లో అంటు వ్యాధులు ప్రబలకూడదనే లక్ష్యంతో పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. తీవ్రంగా ప్రభావితమైన గ్రామాల్లో తక్షణమే సూపర్ క్లోరినేషన్ మరియు శానిటేషన్ కార్యక్రమాలు మొదలుపెట్టాలని ఆదేశించారు. తాగునీటి పథకాల ట్యాంకుల దగ్గర క్లోరినేషన్ పకడ్బందీగా అమలు చేయాలి. నీటి సరఫరాకు ఇబ్బందులు ఉంటే, ప్రజలకు ఇక్కట్లు రాకుండా తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి సూచించారు..
ఈ మహా యజ్ఞం కోసం 21,055 మంది శానిటేషన్ సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి, పారిశుద్ధ్య పనులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. అలాగే, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను ప్రాధాన్య క్రమంలో చేపట్టాలని ఆదేశించారు.సాధారణ పరిస్థితి నెలకొనే వరకు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి, గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.


