Deputy CM Pawan Kalyan On Plastic Free: ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు త్వరలో యాక్షన్ ప్లాన్ తీసుకొస్తామని.. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పౌరులను భాగస్వామ్యం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్లాస్టిక్ నియంత్రణకు ముందుకు రావాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం అసెంబ్లీలో ప్లాస్టిక్ వినియోగంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారు.
మన జీవితాల్లో ప్లాస్టిక్ ఒక భాగం అయిపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం క్రమశిక్షణతో అమలు అవుతుందని ఆయన గుర్తు చేశారు. ప్లాస్టిక్ నియంత్రణ అనేది రాజకీయ నేతల నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు.
‘ఏ చిన్న కార్యక్రమం అయినా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లెక్సీల వాడకం విచ్చలవిడిగా పెరిగి పోయింది. ఒక్క సారి వాడిన ప్లాస్టిక్‌ను నియంత్రించడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్‌లకు ఆదేశాలు ఇచ్చాం. సచివాలయంలో ప్లాస్టిక్ ఫ్రీగా ప్రకటించాం. దీంతో గాజు బాటిళ్లలో నీరు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్క్యూలర్ ఎకానమీలో భాగంగా పార్కులు, ప్లాస్టిక్ రీ సైకిలింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది’. అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Also Read: https://teluguprabha.net/national-news/mk-stalin-vows-bjp-enter-tamil-nadu-assembly-elections/
ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా బయోడీగ్రేడబుల్ తయారీ పరిశ్రమలను ప్రోత్సాహిస్తున్నామని పవన్ అన్నారు. దీనికి సంబంధించి పౌరులు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలు పెడుతున్నాయని, ప్లాస్టిక్ బాటిళ్లు, గ్లాసులు పర్యవరణాన్ని కలుషితం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రెండు మూడు నెలల్లో పటిష్ఠ కార్యాచరణతో వస్తున్నామని వివరించారు. నిర్మల్ గ్రామ పురస్కారం తరహలో ప్లాస్టిక్ రహిత గ్రామాలకు ఇన్సెంటివ్స్ ఇస్తామని ప్రకటించారు. వచ్చే సెషన్‌లో పర్యావరణం, కాలుష్యంపై ప్రత్యేక చర్చ జరుగుతుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.


