Pawan Kalyan about Vizag AI Hub: దేశంలోనే తొలిసారిగా విశాఖలో ఏఐ సిటీ ఏర్పాటు చేయడం టెక్ రంగంలో కీలక మైలురాయి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో 15 బిలియన్ డాలర్ల గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఒప్పందంతో వికసిత్ భారత్ దిశగా చరిత్రాత్మక ముందడుగు వేస్తుందని ‘X’ వేదికగా పవన్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు నగరం విశాఖపట్నం నుంచి ‘వికసిత్ భారత్’ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రయాణం మొదలుపెట్టిందని హర్షం వ్యక్తం చేశారు.
టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.88,628 కోట్ల (10 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనన్న నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ మేరకు ఈ ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. నగరంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు ద్వారా యువత, రైతులు, మత్స్యకారులు, వైద్యులు, పారిశ్రామిక వేత్తలు, మహిళలు, విద్యార్థులు ఇలా ప్రతి వర్గానికి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ శక్తి అందుబాటులోకి రానుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
‘వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ దూరదృష్టి, ప్రపంచ స్థాయిలో భారత్‌పై ఏర్పడిన విశ్వాసం.. విశాఖలో పెట్టుబడికి మార్గం సుగమం చేసింది. సీఎం చంద్రబాబు నాలుగు దశాబ్దాల దూరదృష్టి, ఆయన నాయకత్వం ద్వారానే ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి రాగలిగింది. ఆవిష్కరణలో యువత పాల్గొనాలి. విద్యాసంస్థలు పరిశోధనలు చేయాలి. పరిశ్రమలు విస్తరించాలి. దేశ భవిష్యత్తులో పౌరులు భాగస్వాములు కావాలి. సమిష్టిగా నూతన భవిష్యత్తును నిర్మించడం మనందరి బాధ్యత.’ అని పవన్ అభిప్రాయపడ్డారు.


