ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ(AP Assembly) బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Ayyanna Patrudu), డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబుకు ఎంత సమయం ఇస్తారో, తనకూ అంత సమయం ఇవ్వాలని జగన్(Jagan) అడగడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు జగన్‌కు ప్రతిపక్ష నేత హోదాయే లేదని స్పష్టం చేశారు. ఆయనకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యకు ప్రతిపక్ష నేత హోదా రాదని తేల్చిచెప్పారు. 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే గానీ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వీలు లేదన్నారు.
ఇక డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) మాట్లాడుతూ.. జగన్ అసెంబ్లీ నియమ నిబంధనలు తెలుసుకోవాలని హితవు పలికారు. ఎలాంటి అనుమతి లేకుండా 60 రోజులు పాటు అసెంబ్లీకి రాకుండా ఉంటే నిబంధనల ప్రకారం అనర్హత వేటు వేయవచ్చని వెల్లడించారు. నిర్దిష్ట కారణం వల్ల అసెంబ్లీకి రాలేకపోతున్నాను అంటూ వ్యక్తిగతంగా లేఖ ఇవ్వాలని.. ఆ లేఖను సభలో ప్రస్తావించి సహేతుక కారణం ఉంటే స్పీకర్ అనుమతి ఇస్తారని స్పష్టం చేశారు.