అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం
తెలుగు భాష కోసం కృషి చేసిన గొప్ప సాహితీ వేత్తల శ్రమను నేటి తరానికి తెలిపే బాధ్యతను తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఉపాధ్యాయులను కోరారు.
శుక్రవారం నిడదవోలు పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం(International Mother Language Day) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు. శ్రీకృష్ణదేవరాయలుతో సహా తెలుగు భాష గొప్పతనాన్ని విశ్వవినువీధుల్లో విహరింపజేసిన అనేక మంది మహానుభావులను మంత్రి దుర్గేష్ స్మరించుకున్నారు.
ఈ క్రమంలో వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ మాతృభాషపై విద్యార్థుల్లో అనురక్తిని పెంపొందించేందుకు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంగ్లంతో పాటు మాతృభాష అవసరాన్ని విద్యార్థులకు తెలపాలని సూచించారు. తమిళనాడు తరహాలో తెలుగువారు సైతం మాతృభాష కోసం దోహదపడాలన్నారు.
మాతృభాష పరిరక్షణ కోసం, తెలుగు భాష వ్యాప్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలుగు భాషా సాంస్కృతిక వికాసం కోసం సహకరించేందుకు సాంస్కృతిక శాఖ మంత్రిగా తానున్నానని తెలిపారు. తెలుగు భాష అంతరిస్తే తెలుగు జాతి అంతరిస్తుందని తెలుపుతూ మాతృభాష అభివృద్ధికి, ఔన్నత్యానికి పాటుపడాలన్నారు.