శ్రీశైలం(Srisailam Temple) వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. మహా శివరాత్రి(Maha Sivaratri) బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి వచ్చే భక్తులను ఈనెల 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు అటవీశాఖ చెక్‌పోస్టులో 24 గంటలూ అనుమతించనున్నారు. ఈమేరకు శ్రీశైలం సబ్ డీఎఫ్‌వో అబ్దుల్ రవూఫ్ తెలిపారు. పాదయాత్రగా వచ్చే భక్తుల కోసం అటవీశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. భక్తులు అటవీ ప్రాంతంలోకి 2 నుంచి 5 లీటర్ల నీళ్ల సీసాలను తీసుకెళ్లేందుకు అనుమతిస్తామన్నారు. ఖాళీ సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా దారిలో ఏర్పాటు చేసిన చెత్తకుండీల్లోనే వేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా సాధారణ రోజుల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు శ్రీశైలానికి ఘాట్ రోడ్లలో అనుమతించరు.
మరోవైపు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఉచితంగానే లడ్డూ ప్రసాదం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీళ్లు బాటిల్, పాలు, బిస్కెట్లు ఉచితంగా అందజేయనున్నారు. అలాగే మహాశివరాత్రి రోజున దేవస్థానం టోల్ గేట్ రుసుము లేకుండా ఉచితంగా వాహనాలను అనుమతిస్తారు.