Homeఆంధ్రప్రదేశ్Kakinada:క్రమశిక్షణే యువత విజయానికి సరైన మార్గం.. కలెక్టర్ హరేంధిర ప్రసాద్

Kakinada:క్రమశిక్షణే యువత విజయానికి సరైన మార్గం.. కలెక్టర్ హరేంధిర ప్రసాద్

శంఖవరం(తెలుగుప్రభ): యువత విజయానికి క్రమశిక్షణే సరైన మార్గమని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు క్రమశిక్షణ, కష్టపడి చదవడం ఎంతో ముఖ్యమని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. విజయాలను సాధించేందుకు యువత సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ సానుకూల సానుకూల దృక్పథంతో లక్ష్యాలపై దృష్టి పెట్టాలని పిలుపును ఇచ్చారు. జిల్లా మహిళా అభివృద్ధి – శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలోఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సమన్వయంతో కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో ‘యువ, సఖి’ గ్రూప్ లీడర్లకు జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ‘పిల్లలే దేశ సంపద – వారి భద్రతే మన బాధ్యత’ అనే నినాదంతో ఒత్తిడి నివారణ నిర్వహణ, భావోద్వేగ నియంత్రణ, సైబర్ భద్రత, బాలల పరిరక్షణ అంశాలపై ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ వేటుకూరి సూర్యనారాయణరాజు, సభ్యులు గంగా సూర్య నారాయణ, శిశు సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ) చైర్‌పర్సన్ గంట సత్యనారాయణ, జిల్లా విద్యాధికారి పి.రమేష్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జె.రాంబాబు తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి యువతకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ… జీవితంలో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదిగి విజయం సాధించాలనే కోరుకుంటారని, అయితే కోరుకోవడంతో ఆగిపోకుండా దానికోసం తగిన కృషి చేయాలని తెలిపారు. వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడానికి అత్యంత కీలకమైన ఏకైక గుణం ‘క్రమశిక్షణ’అని, ప్రేరణ తాత్కాలికమని,ఏ రంగం లోనైనా క్రమశిక్షణతో కూడిన నిరంతర కృషి ఉంటేనే సఫలత సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. యువత తమ శక్తిని సామాజిక మార్పు కోసం సానుకూలంగా ఉపయోగించు కోవాలని పిలుపును ఇచ్చారు. అందరికీ రోజూ కేవలం 24 గంటలేనని, ఫోన్లు స్క్రోల్ చేస్తూ సమయాన్ని వృథా చేసు కుంటే పోటీ ప్రపంచంలో వెనుకబడి పోతామని తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఉన్నత చదువుల ప్రవేశ పరీక్షల వంటి ప్రతీ రంగంలోనూ తీవ్రమైన పోటీ ఉంటుందని, కనీసం రోజులో ఎనిమిది గంటలు కష్టపడి చదివేవారే విజయం సాధిస్తారని తెలిపారు. కష్టపడి చదువుకోకపోతే జీవితంలో ఎంతగానో ఇబ్బంది పడాల్సి వస్తుందని విద్య ప్రాముఖ్యతను గుర్తుచేశారు. విద్యార్థులు భావోద్వేగాలను నియంత్రించుకుంటూ, ఒత్తిడిని తట్టుకునే మనో స్థైర్యాన్ని పెంపొందించు కోవాలని సూచించారు. బాల్య వివాహాలు సమాజానికి శాపమని, గోదావరి జిల్లాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరగడం మారాలని కలెక్టర్ అన్నారు. చదువే ఆడపిల్లలకు నిజమైన రక్షణ అని, చదువుకుంటే బాల్య వివాహాల వంటి దురాచారాలను అరికట్టవచ్చని తెలిపారు. బాల్య వివాహాల నియంత్రణ కోసం ఎవరైనా 1098 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించవచ్చని చెప్పారు. ‘యువాన్ సఖీ’ గ్రూపు సభ్యులుగా విద్యార్థులు తమ తోటి వారికి మంచి మార్గదర్శనం చేయాలని, మత్తు పదార్థాల బారిన పడుతున్న తమ తోటి విద్యార్థులను సన్మార్గంలో నడిపించేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. కిషోరి వికాసం ద్వారా సమాజంలో వెలుగు తీసుకువచ్చే బాధ్యత యువతపై ఉందని ఆయన ఆకాంక్షించారు.

- Advertisement -

 

భవిష్యత్తు రూపకర్తలు విద్యార్థులే; భవిష్యత్తు రూపకర్తలు విద్యార్థులేనని, వారు సత్ప్రవర్తనతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని రాష్ట్ర బాలల హక్కుల పరి రక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరిసూర్యనారాయణ రాజు పేర్కొన్నారు.‌ కేవలం చదువు మాత్రమే కాకుండా విద్యార్థుల్లో మంచి నడవడిక, సంస్కారం, దేశభక్తి పెంపొందాలని పిలుపు నిచ్చారు. విద్యార్థులు షార్ట్ కట్ మార్గాలను ఎంచుకోకుండా కష్టపడితేనే జీవితంలో విజయం సాధించగలరని, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ విలువలు, మాతృభాషాభిమానం, స్వదేశీ వస్తువుల వాడకం, పౌర విధులను పాటించడం వంటి ముఖ్యమైన అంశాలపై శ్రద్ధ పెట్టాలని కోరారు. అలాగే బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని సూచిస్తూ, ఆపదలో ఉన్న పిల్లల సహాయం కోసం చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098 ను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

కాలంతోపాటే లక్ష్యం వైపు అడుగులు: కాలాన్ని వృథా చేయకుండా లక్ష్యం వైపు అడుగులు వేయాలని సీడబ్ల్యూసీ చైర్మన్ డా. గంటా సత్యనారాయణ పేర్కొన్నారు.‌ కాకినాడ జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఏర్పాటైన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ద్వారా చిన్నారుల సంరక్షణకు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటా మన్నారు. విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల వంటి డిస్ట్రాక్షన్స్ వైపు మళ్లించకుండా, భవిష్యత్త పై దృష్టి పెట్టాలని పిలుపు నిచ్చారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే యువత కొద్ది కాలం పాటు కష్టపడి చదవాలని, కాలాన్ని వృథా చేయకుండా లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని హితవు పలికారు. విశాఖ జిల్లాలో జరిగిన సంఘటనలో నాలుగు సంవత్సరాల వయసులో తండ్రి చనిపోగా, మొదటి కోవిడ్ లో తల్లి కూడా చనిపోయినప్పటికీ, కేజీబీవీ తొండంగిలో చదువుకుని, పట్టుదలతో నీట్ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించి, రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు పొందిన కాజులూరుకు చెందిన కె.జానకి రత్నప్రభను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఇతర గౌరవ అతిథులు ఘనంగా సత్కరించి, అభినందించారు. ఐసీడీఎస్.పీడీ. సీహెచ్.లక్ష్మి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి వెంకటరావు, ఈగల్ టీం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, సీడీపీవోలు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News