Chandrababu Naidu Slams YSRCP: “కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి పవిత్రతతో ఆడుకున్న వారు ఎవరైనా సరే.. శిక్ష తప్పదు. ఆ దేవుడితో పెట్టుకుంటే వచ్చే జన్మ వరకు ఆగక్కర్లేదు, ఈ జన్మలోనే అనుభవిస్తారు” అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీ నేతలపై విరుచుకుపడ్డారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన, లడ్డూ కల్తీ వ్యవహారంపై జరుగుతున్న ప్రచారంపై సూటిగా స్పందించారు.
ప్రక్షాళన దిశగా తొలి అడుగు!
మేము అధికారంలోకి రాగానే తిరుమల పవిత్రతను కాపాడటమే ప్రథమ కర్తవ్యంగా భావించామని సీఎం పేర్కొన్నారు. అందుకే సమర్థుడైన అధికారి శ్యామలరావును టీటీడీ ఈవోగా పంపామని, ఆయన బాధ్యతలు చేపట్టగానే వ్యవస్థల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.
Also Read: YSRCP – ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే!
ఆధారాలతోనే మాట్లాడాను.. యాగీ ఎందుకు?
ఎన్‌డీడీబీ (NDDB) నివేదికలో కల్తీ నెయ్యి అంశం నిర్ధారణ అయిన తర్వాతే తాను నోరు విప్పానని చంద్రబాబు స్పష్టం చేశారు. “జంతు కొవ్వులు కలిశాయని నివేదిక చెబుతుంటే.. నేను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది. తప్పు చేసి మళ్ళీ కోర్టులకు వెళ్లడం, యాగీ చేయడం వైకాపా నేతల నైజం” అని ఆయన మండిపడ్డారు. నిష్పక్షపాత విచారణ కోసమే సిట్ (SIT) వేసినట్లు ఆయన వివరించారు.
నేను సామాన్య భక్తుడినే..
శ్రీవారిపై తనకున్న భక్తిని చాటుకుంటూ.. తాను ఎప్పుడూ వైకుంఠ ద్వారం గుండా వెళ్లి స్వామిని దర్శించుకోలేదని, దేవుడి ముందు అందరం సమానమేనని బాబు భావోద్వేగంగా మాట్లాడారు. తిరుమలలో గత ప్రభుత్వం మహాపాపం చేసిందని, అపచారం తలపెట్టిన వారు ఆ దేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఇక అనిల్ కుమార్ సింఘాల్ బదిలీపై స్పందిస్తూ.. ఆ విషయంలో ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

